హైదరాబాద్, ఆగస్టు 9 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్‌పై రోజుకొక బాంబు పేలుస్తుండటంపై బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి స్పందించారు. ఈ ప్రతీకార సుంకాల విధించడం వల్ల భారత్‌పై స్వల్ప ప్రభావం మాత్రమే చూపనున్నదన్నారు. హైదరాబాద్‌లో బ్యాంక్ అనుబంధ సంస్థ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసిన ప్రత్యేక హెల్త్ ఇన్సూరెన్స్ శాఖను ఆయన శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ, సముద్రపు ఉత్పత్తులపై ప్రభావం చూపనున్నప్పటికీ మిగతా రంగాలపై పెద్దగా చూపదన్నారు. టారిఫ్‌లపై రెగ్యులేటరీలతో కలిసి పనిచేస్తున్నట్టు, త్వరలో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ట్రంఫ్ టారిఫ్‌లతో ఒక భారతేకాదు ఇతర దేశాలు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. మరోవైపు, గ్రూపునకు చెందిన ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అండ్ అసెట్ మేనేజ్మెంట్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఐపీవోకి వచ్చే అవకాశాలున్నాయని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
అరగంటలో నగదు రహిత వైద్య సేవలు
తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లలో భవిష్యత్తులో 30 బీమా శాఖలను నెలకొల్పబోతున్నట్టు ఆయన ప్రకటించారు. వీటిలో తెలంగాణలో 15, ఏపీల్లో మరో 15 శాఖలను ప్రారంభించనున్నది. ఇరు రాష్ర్టాల్లో చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోలేదని, వారికి అన్ని రకాలుగా సేవలు అందించాలనే ఉద్దేశంతో 2,100 హాస్పిటల్స్‌తో జట్టుకట్టినట్టు చెప్పారు. దీంతో రోగులకు అరగంటలో నగదు రహిత సేవలు అందించడానికి వీలు పడుతుందన్నారు.