ముంబై, అక్టోబర్ 23: గత ఏడాది దేశంలో జరిగిన పేమెంట్ లావాదేవీల వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గురువారం వెల్లడించింది. 2024లో జరిగిన చెల్లింపుల్లో 99.7 శాతం లావాదేవీలు నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్, నాచ్, డెబిట్-క్రెడిట్ కార్డులు, యూపీఐ, ఇతర ప్రీ-పెయిడ్ పేమెంట్ సాధనాల వంటి డిజిటల్ పేమెంట్ (Digital Payments) వేదికల ద్వారానే జరిగినట్టు తెలియజేసింది. మొత్తం లావాదేవీల విలువలో వీటన్నిటి వాటా 97.5 శాతంగా ఉన్నట్టు సెంట్రల్ బ్యాంక్ వివరించింది. చెక్కుల రూపంలో జరిగిన చెల్లింపుల విలువ 2.3 శాతంగా ఉన్నట్టు పేర్కొన్నది. దీంతో నగదు లావాదేవీల విలువ కేవలం 0.2 శాతానికే పరిమితమైనట్టు తేలింది.
అర్ధ వార్షిక పేమెంట్ సిస్టమ్ రిపోర్ట్-జూన్ 2025 పేరిట ఆర్బీఐ విడుదల చేసిన తాజా నివేదికలో ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి-జూన్)లోనూ డిజిటల్ పేమెంట్స్‌దే హవా కొనసాగినట్టు రుజువైంది. ఇక వీటిలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వాటానే 85 శాతం (10,637 కోట్లు)గా ఉండటం గమనార్హం. అయితే మొత్తం లావాదేవీల విలువలో వీటి వాటా 9 శాతమే (రూ.143.3 లక్షల కోట్లు). గత ఏడాది ఇవి వరుసగా 17,221 కోట్లు, రూ.246.8 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2019లో రూ.18.4 లక్షల కోట్ల విలువైన 1,079 కోట్ల లావాదేవీలు జరిగాయి. కాగా, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) సిస్టమ్ ద్వారా జరిగిన చెల్లింపుల విలువ అత్యధికంగా 69 (రూ.1,079.2 లక్షల కోట్లు) శాతంగా ఉన్నది. అయినప్పటికీ లావాదేవీల సంఖ్య 0.1 శాతం (16.1 కోట్లు) మాత్రమే. దీంతో భారీ లావాదేవీలకు ఆర్టీజీఎస్నే అంతా ఎంచుకుంటున్నట్టు స్పష్టమవుతున్నది. చిన్న పేమెంట్స్ అన్నీ యూపీఐ ద్వారానే ఎక్కువగా జరుగుతుండటంతో సంఖ్యాపరంగా లావాదేవీల్లో ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆర్బీఐ వర్గాలు చెప్తున్నాయి. ఇదిలావుంటే నిరుడు లావాదేవీల్లో ఆర్టీజీఎస్వి 29.5 కోట్లుగా ఉన్నాయి. వీటి విలువ రూ.1,938.2 లక్షల కోట్లు. 2019లో ఇవి వరుసగా 14.8 కోట్లు, రూ.1,388.7 లక్షల కోట్లుగా ఉన్నాయి.
2019 నుంచి 2024 వరకు గమనిస్తే.. నెఫ్ట్ లావాదేవీలు సంఖ్యాపరంగా మూడింతలకుపైగా ఎగబాకాయి. 262.2 కోట్ల నుంచి 926.8 కోట్లకు చేరాయి. విలువ కూడా రూ.232.9 లక్షల కోట్ల నుంచి రూ.432.8 లక్షల కోట్లకు పెరిగింది. ఈ ఏడాది జనవరి-జూన్‌లో రూ.237 లక్షల కోట్ల విలువైన 490.5 కోట్ల లావాదేవీలు జరిగాయి. క్రెడిట్ కార్డు లావాదేవీలు నిరుడు 447.2 కోట్లుగా ఉన్నాయి. విలువ రూ.20.4 లక్షల కోట్లు. 2019లో ఇవి వరుసగా 208.7 కోట్లు, రూ.7.1 లక్షల కోట్లే. ఈ ఏడాది ప్రథమార్ధంలో రూ.11.1 లక్షల కోట్ల విలువైన 266.3 కోట్ల లావాదేవీలు జరిగాయి.
వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఫారిన్ కరెన్సీ డెరివేటివ్‌లు, రూపీ వడ్డీరేటు కోసం ఓవర్-ది-కౌంటర్ (ఓటీసీ) మార్కెట్లలో అన్ని లావాదేవీలకు యూనిక్ ట్రాన్జాక్షన్ ఐడెంటిఫైయర్ (యూటీఐ)ను తప్పనిసరి చేయాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఈ మేరకు గురువారం ‘యూటీఐ ఫర్ ఓటీసీ డెరివేటివ్ ట్రాన్జాక్షన్స్ ఇన్ ఇండియా’పై ఓ డ్రాఫ్ట్ సర్క్యులర్‌ను విడుదల చేసింది. ఓటీసీ డెరివేటివ్‌లు ఫైనాన్షియల్ డెరివేటివ్ కాంట్రాక్టులు. రెగ్యులేటెడ్ ఎక్సేంజీల్లో కాకుండా రెండు పార్టీల మధ్య నేరుగా ట్రేడ్ అవుతాయి. మరోవైపు నూతన సాంకేతిక పరిష్కారాల కోసం ఆర్బీఐ ఓ గ్లోబల్ హ్యాకథాన్‌ను ప్రారంభించింది.