Digital Payment | భారతదేశంలో జరుగుతున్న డిజిటల్ చెల్లింపు విప్లవం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలతోనూ అనుసంధానించినట్లు తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేసిన బుక్‌లెట్‌లో పేర్కొంది. ‘భారతదేశంలో జరుగుతున్న డిజిటల్ చెల్లింపు విప్లవం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ ఏడాది మార్చిలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI)లో సుమారు రూ.24.77 లక్షల కోట్ల విలువైన 1,830.151 కోట్ల యూపీఐ లావాదేవీలు’ జరిగాయి’ అని పేర్కొంది. ఈ వ్యవస్థను ప్రస్తుతం దాదాపు 460 మిలియన్ల మంది యూజర్లతో పాటు 65 మిలియన్ల వ్యాపారులు ఉపయోగించుకుంటున్నారని కేంద్రం తెలిపింది. చిన్న చిన్న లావాదేవీలు సైతం డిజిటల్ చెల్లింపుల్లోనే జరుగుతున్నాయని పేర్కొంది.
దాదాపు 50శాతం చిన్న, సూక్ష్మ చెల్లింపులుగా వర్గీకరించినట్లు పేర్కొంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) విషయానికి వస్తే.. పాలనలో పారదర్శకతను, అక్రమాలను అరికట్టేందుకు మోదీ ప్రభుత్వం ఈ సాంకేతిక సహాయంతో సమర్థవంతం వినియోగించుకున్నట్లు తెలిపింది. వివిధ సంక్షేమ పథకాల్లో నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేయడం, ఆధార్‌ను తీసుకురావడం వల్ల లక్షలాది మంది అనర్హులను తొలగించినట్లు పేర్కొంది. ప్రభుత్వానికి భారీగా డబ్బు ఆదా అయ్యిందని.. దాంతో ప్రజలకు సకాలంలో వివిధ ప్రయోజనాలు అందించగలిగినట్లు పేర్కొంది. 2015 -2023 మధ్య డీబీటీ ద్వారా ప్రభుత్వానికి రూ.3.48లక్షల కోట్లు ఆదా అయ్యాయని పేర్కొంది. గత పదకొండేళ్లలో కోట్లాది కుటుంబాలు బ్యాంకు ఖాతా, బీమా సహా ప్రాథమిక సౌకర్యాలు పొందాయని పేర్కొంది. పదకొండేళ్లలో 55.22 కోట్ల జన్ ధన్ ఖాతాలు తెరవడంతో పాటు 51 కోట్ల మంది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పరిధిలోకి తీసుకువచ్చినట్లు కేంద్రం వివరించింది.