Dhanteras 2024 | ధన త్రయోదశి (Dhanteras).. ఏటా దీపావళి ముందు వచ్చే ఈ ధన త్రయోదశిని దేశవ్యాప్తంగా హిందువులు భక్తిశ్రద్దలతో నిర్వహిస్తుంటారు. ధన త్రయోదశి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. ఈ పండగ రోజున బంగారం కొనుగోలు చేయడం వలన ఇంటికి శుభం కలుగుతుందని, శ్రేయస్సు చేకూరుతుందని విశ్వాసం. అందుకే ప్రస్తుతం బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ ఒక్క గ్రామైనా సరే కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. కుదరని వాళ్లు వెండి ఇతర వస్తువులను కొనుగోలు చేసి ఇంట్లో లక్ష్మీదేవికి వద్ద ఉంచి పూజ చేస్తారు.
అయితే, ఈ ధన త్రయోదశికి బంగారం దుకాణంకు వెళ్లకుండానే పది నిమిషాల్లో మనకు అవసరమైన బంగారు, వెండి నాణేలను (Gold And Silver) ఇంటి వద్దకే తెప్పించుకోవచ్చు. అదెలా అంటారా.. క్విక్ కామర్స్ సంస్థలు బ్లింకిట్, బిగ్ బాస్కెట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో ద్వారా. ఇవి ఈ దీపావళికి బంగారు, వెండి నాణేలను ఇంటి వద్దకే.. అది కూడా మనం ఆర్డర్ చేసిన పది నిమిషాల్లోనే డెలివరీ చేసేందుకు ముందుకొచ్చాయి. ఇందుకోసం ఆయా సంస్థలు పలు జువెల్లరీ సంస్థలతో భాగస్వామ్యంతో డెలివరీ చేసేందుకు సిద్ధమయ్యాయి.
బ్లింకిట్..
బ్లింకిట్ (Blinkit).. మలబార్ గోల్డ్ అండ్ డైమంట్స్, జోయాలుక్కాస్ సంస్థల భాగస్వామ్యంతో వెండి, బంగారు నాణేలను పది నిమిషాల్లోనే డెలివరీ చేయనుంది. ఈ విషయాన్ని బ్లింకిట్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అల్బిందర్ ధిండ్సా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ధన త్రయోదశి శుభాకాంక్షలు తెలిపారు. మలబార్, జోయాలుక్కాస్, MMTC వంటి విశ్వసనీయ బ్రాండ్ల నుండి వెండి (10గ్రా), గోల్డ్ (1గ్రా, 0.5గ్రా) నాణేలను డెలివరీ చేయనున్నట్లు వెల్లడించారు.
బిగ్ బాస్కెట్..
టాటా బ్రాండ్ తనిష్క్ జువెల్లరీ భాగస్వా్మ్యంతో బిగ్ బాస్కెట్ (BigBasket) పలు నగరాల్లో ఈ సేవలను అందిస్తోంది. గోల్డ్, సిల్వర్ కాయిన్స్‌ని ఈ పండగ సీజన్లో ఇంటికి డెలివరీ చేస్తోంది. దుకాణాలకు వెళ్లకుండానే 999.9 ప్యూరిటీతో లక్ష్మీ గణేశ్ వెండి నాణేలు, 22 క్యారెట్ల గ్రాము విలువైన గోల్డ్ కాయిన్‌తోపాటు లక్ష్మి మోటిఫ్‌తో ఉన్న గ్రాము బంగారు నాణేన్ని కూడా డెలివరీ చేసేందుకు సిద్ధమైంది.
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్..
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ (Swiggy Instamart).. మలబార్ గోల్డ్ అండ్ డైమంట్స్, ముత్తూట్ ఎగ్జిమ్, జార్ భాగస్వామ్యంతో కస్టమర్లకు ఈ సేవలు అందిస్తోంది. స్విగ్గీ ద్వారా.. 0.1 గ్రా, 0.25 గ్రా, 0.5 గ్రా, 1 గ్రా బరువుతో జార్ 24 క్యారెట్ గోల్డ్ కాయిన్స్‌ను కస్టమర్లు కొనుగోలు చేయొచ్చు. ఇక ముత్తూట్ ఎగ్జిమ్ 24 క్యారెట్ల గ్రాము గోల్డ్ కాయిన్ అందిస్తోంది. మలబార్ నుంచి 24 క్యారెట్ల గోల్డ్ కాయిన్ (1 గ్రా), 5 గ్రా, 11.66 గ్రా, 20 గ్రాముల ఎంపికతో 999 స్వచ్ఛమైన వెండి నాణేలను స్విగ్గీ ద్వారా కొనుగోలు చేయొచ్చు.
జెప్టో..
జెప్టో (Zepto) తన కస్టమర్లకు Augmont 24 క్యారెట్ల 999 ప్యూర్ సిల్వర్ కాయిన్ (10 గ్రా)తో పాటు 0.1 గ్రా, 0.5 గ్రా, 1 గ్రా బరువుతో 24 క్యారెట్ల బన్యన్ ట్రీ గోల్డ్ కాయిన్‌ను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇక మలబార్ 24 క్యారెట్ల రోజ్ గోల్డ్ కాయిన్ (0.5 గ్రా), 24 క్యారెట్ల లక్ష్మీ గోల్డ్ కాయిన్ (1 గ్రా), 999 ప్యూర్ లక్ష్మీ గణేష్ సిల్వర్ కాయిన్ (10 గ్రా)తో సహా మరికొన్నింటిని జెప్టో ద్వారా ఆన్లైన్ డెలివరీ చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఆయా సంస్థల ద్వారా మీరు కూడా ఈ ధనత్రయోదశికి గోల్డ్, సిల్వర్ కాయిన్స్‌ను ఇంటి వద్దకే తెప్పించుకోండి.
Also Read..
Amitabh Bachchan: అమితాబ్ వద్ద అప్పు తీసుకున్న రతన్ టాటా.. ఆ స్టోరీ ఏంటో చెప్పిన బిగ్ బీ
Maruti Suzuki | మారుతి సుజుకి అంచనాలు మిస్.. ఆరు శాతం స్టాక్ పతనం
PM Modi | ఈ దీపావళి చారిత్రాత్మకం : ప్రధాని నరేంద్ర మోదీ