ముంబై: టాటా సంస్థ అధినేత, దివంగత రతన్ టాటా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను బాలీవుడ్ స్టార్ అమితాబ్(Amitabh Bachchan) వెల్లడించారు. గొప్ప దాతగా పేరుగాంచిన వ్యాపారవేత్త రతన్ టాటా అక్టోబర్ 9వ తేదీన ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే కౌన్ బనేగా కరోడ్‌పతి 16వ సీజన్లో రతన్ టాటా గురించి అమితాబ్ బచ్చన్ మాట్లాడారు. రతన్ టాటా చాలా సాధారణ మనిషి అని, అలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని చూడలేదన్నారు. ఆయన గొప్పతనాన్ని మాటల్లో చెప్పలేమన్నారు.
ఓసారి తాను వెళ్తున్న ఫ్లయిట్లో రతన్ టాటా ఉన్నారని, హీత్రూ విమానాశ్రయంలో దిగిన తర్వాత .. రతన్ టాటా తన వ్యక్తుల గురించి ఎదురుచూశారన్నారు. వాళ్లు రాకపోవడంతో ఆయన ఫోన్ చేసేందుకు ఫోన్‌బూత్ వెళ్లారని, ఆ సమయంలో తాను అక్కడే నిలబడినట్లు అమితాబ్ తెలిపారు. కొంత సమయం తర్వాత ఫోన్ బూత్ నుంచి బయటకు వచ్చిన రతన్ టాటా.. తన వద్దకు వచ్చి అమితాబ్.. కొంత డబ్బును అప్పు ఇస్తావా అని అడిగినట్లు బిగ్‌బీ గుర్తు చేశారు. ఫోన్ కాల్ చేసేందుకు తన వద్ద డబ్బులు లేవని రతన్ టాటా పేర్కొన్నట్లు అమితాబ్ వెల్లడించారు.
రతన్ టాటా సౌమ్యమైన వ్యక్తిత్వం గురించి మరో విషయాన్ని కూడా అమితాబ్ తెలిపారు. రతన్ సుగుణం తన మిత్రులను కూడా ఆకట్టుకున్నట్లు అమితాబ్ చెప్పారు. ఓ ఈవెంట్‌కు హాజరైన తన మిత్రుడిని ఇంటి వద్ద దించాలని రతన్ కోరినట్లు గుర్తు చేశారు. నన్ను ఇంటి వద్ద దించుతావా, నేను మీ ఇంటి పక్కనే ఉంటాను అని రతన్ టాటా తన మిత్రుడికి చెప్పినట్లు అమితాబ్ తెలిపారు.