Air India-DGCA | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రయాణికులకు సివిల్ ఏవియేషన్ రిక్వైర్ మెంట్స్ (Civil Aviation Riquirements -CAR) సేవలందించనందుకు ఎయిర్ ఇండియాకు రూ.10 లక్షల జరిమాన విధించిన డీజీసీఏ.. షోకాజ్ నోటీసు కూడా జారీ చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
‘విమాన సర్వీసులు రద్దయినా, ఆలస్యమైనా.. ఏ కారణం చేతనైనా విమానంలోకి ప్రయాణికులను బోర్డింగ్‌కు అనుమతించకున్నా, వారికి ఎయిర్ లైన్స్ తగు సౌకర్యాలు కల్పించాలి. గత మే నెలలో ఈ విషయమై తనిఖీలు నిర్వహించినప్పుడు సీఏఆర్ నిబంధనలు అమలు చేయలేదని గుర్తించాం. ఈ విషయమై షోకాజ్ నోటీసు జారీ చేశాం. గతేడాది తనిఖీలు నిర్వహించినప్పుడు సీఏఆర్ అమలు చేయనందుకు ఎయిర్ ఇండియాపై రూ.10 లక్షల జరిమాన విధించాం’ అని డీజీసీఏ తెలిపింది.