EV Charging Stations | హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం అంతకంతకూ పెరుగుతున్నా, ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటులో ప్రోత్సాహం కరువైంది. ముఖ్యంగా విద్యుత్తు సంస్థలే మోకాలడ్డుతున్నాయి. రాష్ట్రంలోని పెట్రోల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించినప్పటికీ..విద్యుత్ సంస్థలు మాత్రం సహాయ సహకారాలు అందించడం లేదు. ఈ మేరకు హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ, చార్జ్‌జోన్, నయారా, అదానీ, జియో వంటి సంస్థలు ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు దరఖాస్తులు చేసుకున్నాయి. హైదరాబాద్ సహా జిల్లా కేంద్రాలు, చిన్న పట్టణాల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 300 స్టేషన్ల ఏర్పాటుకు అనుమతులు లభించాయి. ఈ స్టేషన్ల ఏర్పాటుకు అవసరమయ్యే ట్రాన్స్ఫార్మర్లు, ఉపకరణాలు, పరికరాలను డిస్కమ్‌లే సరఫరా చేయాల్సివున్నది. ఈ స్టేషన్ల కోసం 63 కేవీఏ, 100 కేవీఏ, 160 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లతోపాటు, కేబుళ్లు, ఏబీ స్విచ్ బోర్డు వంటి పరికరాలను డిస్కంలు సరఫరా చేయాలి.
వాటికి కావాల్సిన నగదును కంపెనీలు చెల్లించాక డిస్కమ్ స్టోర్స్ నుంచి ఆయా సంస్థలకు వాటిని అందజేయాలి. ఇందుకు సంబంధించి 3 నెలల క్రితమే ఒక్కో సంస్థ రూ.3.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు నగదును డిస్కమ్‌లకు చెల్లించాయి. నిబంధనల ప్రకారం మూడు రోజుల్లో పరికరాలను అందించాల్సి ఉన్నది. 15 రోజుల్లో బిగించాలి. కానీ మూడు నెలలు దాటినా ట్రాన్స్ఫార్మర్లు, ఇతర పరికరాలను డిస్కమ్‌లు సరఫరా చేయడమే లేదు. దీంతో ఆయా సంస్థల ప్రతినిధులు డిస్కమ్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా కనీస స్పందన కరువైంది. ఈ ప్రభావం అంతిమంగా ఈవీ వాహన వినియోగదారులపై పడుతున్నది. పలుచోట్ల స్టేషన్లు లేక చార్జింగ్ చేసుకోలేక వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో ఈవీ వాహనదారులు తమ ఇంటిలోనే చార్జింగ్ పెట్టుకుంటున్నారు. ఇది ప్రమాదం అని తెలిసిన సరిపడ చార్జింగ్ స్టేషన్లు లేకపోవడంతో ఇంట్లో విద్యుత్‌తో సరిపెట్టుకుంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇదీ పరిస్థితి!