న్యూఢిల్లీ : వారాంతంలో ఫ్యామిలీతో కలిసి సరదాగా రెస్టారెంట్‌కు వెళితే పెరిగిన ధరలతో జేబు గుల్ల కావడం అటుంచి సర్వీసు చార్జీల పేరుతో అదనపు బాదుడు వినియోగదారులను కుంగదీస్తోంది. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హోటళ్లు, రెస్టారెంట్లు సర్వీస్ చార్జీని వసూలు చేయరాదని వినియోగదారుల వ్యవహారాల శాఖకు చెందిన సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఆదేశించింది.
ఫుడ్ బిల్లులపై ఆటోమేటిక్‌గా లేదా డిఫాల్ట్‌గా సర్వీసు చార్జీలను వసూలు చేయవద్దని హోటళ్లు, రెస్టారెంట్లకు స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించిన హోటళ్లు, రెస్టారెంట్లపై వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చని సీసీపీఏ పేర్కొంది. ఎలాంటి ఇతర పేర్లతో సర్వీసు చార్జీని వసూలు చేయరాదని తేల్చిచెప్పింది. సర్వీస్ చార్జి చెల్లించాలని ఏ హోటల్, రెస్టారెంట్ వినియోగదారులపై ఒత్తిడి తీసుకురాకూడదని ఆదేశించింది. వినియోగదారుడు స్వచ్ఛందంగా సర్వీస్ చార్జీ చెల్లించవచ్చని దీనిపై ఎలాంటి బలవంతం ఉండదని వినియోగదారులకు హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు తెలియచేయాలని కోరింది.
ఫుడ్ బిల్లుతో పాటు సర్వీస్ చార్జిని కలిపి మొత్తం బిల్లుపై జీఎస్టీ విధించడం అనుమతించబోమని తెలిపింది. సర్వీస్ చార్జిని బిల్లులో కలిపి ఆ మొత్తంపై జీఎస్టీ విధిస్తే సర్వీస్ చార్జిని తొలగించాలని వినియోగదారులు ఆయా హోటళ్లు, రెస్టారెంట్లను కోరవచ్చని పేర్కొంది. సమస్య పరిష్కారం కాకుంటే వినియోగదారులు 1915 నెంబర్‌పై నేషనల్ కన్జూమర్ అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. ఎన్సీహెచ్ మొబైల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది.