ముంబై, జనవరి 28: దేశీయ లోన్ మార్కెట్లో బంగారం తనఖాపై ఇచ్చే రుణాలకు భలే గిరాకీ కనిపిస్తున్నది. తాజాగా విడుదలైన ఓ నివేదిక గోల్డ్ లోన్లకున్న డిమాండ్‌కు అద్దం పట్టింది మరి. ఏటా పుత్తడి ధరలు పెరుగుతూపోతున్న విషయం తెలిసిందే. ఇటీవలికాలంలోనైతే రేట్లు విపరీతంగా పుంజుకుంటున్నది చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే 2023 నవంబర్ నుంచి 2025 నవంబర్ మధ్య గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో రెట్టింపైనట్టు తేలింది. బుధవారం క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ క్రిఫ్ హై మార్క్ ఇచ్చిన రిపోర్టులో గత ఏడాది నవంబర్ నాటికి పసిడి రుణాల్లో దాదాపు 100 శాతం వృద్ధి నమోదైంది. 2023 నవంబర్‌లో రూ.7.9 లక్షల కోట్లుగా ఉంటే.. 2025 నవంబర్‌లో రూ.15.6 లక్షల కోట్లకు రుణాలు ఎగబాకాయి. 2024 నవంబర్‌తో ముగిసిన ఏడాది కాలంలో గోల్డ్ లోన్లు 39 శాతం పెరిగితే.. ఆ తర్వాతి ఏడాది కాలంలో 42 శాతం పెరుగుదల కనిపించింది.
సేఫ్ జోన్..
గోల్డ్ లోన్లను రుణదాతలు (బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు) రక్షణాత్మక రుణాలుగా చూస్తున్నాయి. బంగారాన్ని తమ వద్ద తనఖా పెట్టుకుని ఆ రోజు మార్కెట్ ధర ఆధారంగా రుణగ్రహీతలకు చెల్లింపులు చేస్తున్నాయి. దీంతో ఎగవేతలకు తావు లేకుండా పోయింది. అందుకే అంతా గోల్డ్ లోన్ సెగ్మెంట్‌పై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆకర్షణీయ వడ్డీరేట్లనూ ఆఫర్ చేస్తున్నారు. పైగా చాలామందికి తమ తక్షణ నగదు అవసరాలకు బంగారమే సులభతర మార్గంగా ఉంటుండటం కూడా గోల్డ్ లోన్ మార్కెట్‌ను ఏటా పెంచేస్తున్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక రిటైల్ లోన్ పోర్ట్‌ఫోలియోలో 2024 నవంబర్ నుంచి 2025 నవంబర్‌కు గోల్డ్ లోన్ల వాటా 8.1 శాతం నుంచి 9.7 శాతానికి పెరిగిందని తాజా నివేదిక సైతం తేటతెల్లం చేసింది.
భారీ రుణాలే అధికం
నిరుడు నవంబర్ నాటికిగల గోల్డ్ లోన్లలో దాదాపు సగం వాటా రూ.2.5 లక్షలకుపైగా ఉన్నవేనని క్రిఫ్ హై మార్క్ తెలిపింది. ఇక పసిడి రుణగ్రహీతల్లో 56 శాతం పురుషులే. అయితే మహిళా రుణగ్రహీతల్లోనే సకాలంలో సక్రమంగా అప్పు తీర్చుతున్నవారు ఎక్కువగా ఉన్నారని ఈ సందర్భంగా రిపోర్టు స్పష్టం చేయడం గమనార్హం. కాగా, గోల్డ్ లోన్ మార్కెట్లో ప్రభుత్వ రంగ బ్యాంకులదే మెజారిటీ వాటా. 60 శాతం వ్యాపారం వీరి చేతిలోనే ఉందని తాజా నివేదిక పేర్కొన్నది. కేవలం బంగారం తనఖాపైనే రుణాలిస్తూ వ్యాపారం చేస్తున్న బ్యాంకింగేతర సంస్థల వాటా 8.1 శాతమే. పసిడి రుణాల వృద్ధిలో గుజరాత్ 67 శాతంతో ముందున్నది. 50 శాతంతో ఆ తర్వాత కర్ణాటక, మహారాష్ట్రలున్నాయి. అయినప్పటికీ దక్షిణాది రాష్ర్టాల్లోనే గోల్డ్ లోన్ బిజినెస్ బాగా విస్తరిస్తున్నది. ఇక మొండి బకాయిల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిషా రాష్ర్టాల రుణగ్రహీతలవే ఎక్కువని తాజా నివేదిక స్పష్టం చేసింది.
రికార్డు ధరల్లోనే పసిడి-వెండి ; తులం బంగారం రూ.1,71,000 ,కిలో వెండి రూ.3,85,000
బంగారం, వెండి ధరలు ఆల్‌టైమ్ హై రికార్డుల్లోనే పరుగులు పెడుతున్నాయి. ఢిల్లీ స్పాట్ మార్కెట్లో బుధవారం 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి రేటు మునుపెన్నడూ లేనివిధంగా రూ.1,71,000 పలికింది. ఈ ఒక్కరోజే రూ.5,000 పుంజుకున్నది. కిలో వెండి విలువ సైతం రూ.15,000 ఎగబాకింది. ఫలితంగా ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిలో రూ.3,85,000గా నమోదైనట్టు అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలియజేసింది.
హైదరాబాద్‌లో..
హైదరాబాద్ రిటైల్ మార్కెట్లో 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) తులం పసిడి ధర రూ.1,53,150గా ఉన్నది. మంగళవారం ముగింపుతో చూస్తే.. రూ.4,700 ఎగబాకింది. కిలో వెండి ధర రూ.3,85,000కు ట్రేడ్ అవుతున్నది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు ఫారెక్స్.కామ్ వివరాల ప్రకారం 5,256.35 డాలర్లుగా ఉన్నది. ఒక్కరోజులో 74.57 డాలర్లు పెరిగింది. సిల్వర్ 112.22 డాలర్లు పలికింది. సాధారణ కొనుగోలుదారులతోపాటు ఇన్వెస్టర్లు, ఇండస్ట్రీ వర్గాల నుంచి వెండికి డిమాండ్ ఉంటున్నది. అందుకే భారీ ఎత్తున రేట్లు పుంజుకుంటున్నాయని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి.