న్యూఢిల్లీ, మే 30: దేశవ్యాప్తంగా పసిడికి డిమాండ్ పడిపోతున్నది. దిగుమతులను నియంత్రించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పుత్తడిపై దిగుమతి సుంకాన్ని ఆరు శాతం నుంచి 15 శాతానికి పెంచడంతో ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇప్పటికే గరిష్ఠ స్థాయిలో కదలాడుతున్న గోల్డ్ ధరలకు దిగుమతి సుంకం పెంపుతో మరింత పుంజుకున్నాయి. దీంతో పసిడి కొనుగోలు చేయడానికి సామాన్యుడి నుంచి సంపన్న వర్గాల వరకు జంకుతున్నారు. దిగుమతి సుంకం పెంపుతో ప్రస్తుత నెలలో పసిడి డిమాండ్ 70 శాతం తగ్గిందని ఇండస్ట్రీ వర్గాలు అంచనావేస్తున్నారు. దీనికి తోడు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో చమురు ధరలు భగ్గుమనడం, ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉందన్న అంచనా బంగారం కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం చూపనున్నదని వారు పేర్కొంటున్నారు.
ప్రస్తుత నెల పదిహేను రోజుల్లో గోల్డ్ డిమాండ్ 70 శాతానికి పైగా పడిపోయి 7.5 టన్నులకు దిగిందని పేర్కొంది. క్రితం ఏడాది ఇదే సమయంలో 25 టన్నుల గోల్డ్ డిమాండ్ నెలకొన్నది. ఈ నెల 13న పసిడి దిగుమతులపై సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దిగుమతి సుంకం పెంపుతో అమ్మకాలు 70 శాతం వరకు తగ్గాయని ఇండియా బులియన్ అండ్ జ్యూవెల్లర్స్ అసోసియేషన్(ఐబీజేఏ) నేషనల్ సెక్రటరీ సురేంద్ర మెహతా తెలిపారు. మొత్తం విక్రయాల్లో 65 శాతం వాటా కలిగిన అసంఘటిత రంగ సంస్థలు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, వీటికి తోడు జీఎస్టీ విధించడం మరింత కుంగదీస్తున్నదన్నారు. గోల్డ్‌పై జీఎస్టీని 9.18 శాతం నుంచి 18.45 శాతానికి పెంచారు.
దెబ్బతీస్తున్న పొదుపు చర్యలు
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దేశీయ అన్ని రంగాలపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతున్నది. ఒకవైపు ఇంధన ధరలు, మరోవైపు ఆహార పదార్థాలు భగ్గుమంటుండటంతోపాటు ప్రస్తుతం పసిడిపై ప్రతికూల ప్రభావం పడుతున్నది. రూపాయి పతనం, చమురు ధరలు కారణంగా దిగుమతి రూల్స్‌లను మరింత కట్టుదిట్టం చేసింది కేంద్ర సర్కార్. అమ్మకాలు కేవలం దిగుమతి సుంకం పెంపుతో పడిపోలేదని, ఇతర కారణాలు కూడా ఉన్నాయని జోయాలుక్కాస్ చైర్మన్ జోయ్ అలుక్కాస్ తెలిపారు. బంగారం కొనుగోళ్లు నిలిపివేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను కోరడం కూడా కొనుగోళ్ల సెంటిమెంట్‌ను తీవ్రస్థాయిలో ప్రభావం చూపిందన్నారు.
ఈ వ్యాఖ్యలతో జోయాలుక్కాస్ స్టోర్లలో అమ్మకాలు 35 శాతం పడిపోయాయన్నారు. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదని ఆయన వాపోయారు. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.1.60 లక్షల స్థాయిలో ఉన్నది. దేశవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో చిన్న రిటైలర్ల దుకాణాలు వెలవెలపోతున్నాయన్నారు. మధ్యస్థాయి ఆభరణాల విక్రయ సంస్థలు తమ పంతాను మార్చుకొని గోల్డ్ ఎక్సేంజ్ పథకాలకు శ్రీకారం చుట్టాయని చెప్పారు. ఈ ఏడాది తొలి త్రైమాసికం(జనవరి నుంచి మార్చి మధ్యకాలం)లో పసిడి డిమాండ్ ఏడాది ప్రాతిపదికన 34 శాతం ఎగబాకి 62.3 టన్నులకు చేరుకున్నది. ఆ తర్వాత పరిస్థితులు తలకిందులయ్యారు. ప్రపంచంలో అత్యధిక గోల్డ్‌ను వినియోగిస్తున్న దేశాల్లో తొలిస్థానంలో ఉండే భారత్ ప్రతియేటా 800 నుంచి 850 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నది.