హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సోలార్ ప్లాంట్ల నిర్మాణంలో జాప్యం చేసినట్టయితే, అందుకు సంబంధించిన కాంట్రాక్టులను రద్దు చేస్తామని సింగరేణి సీఎండీ బలరాం హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలమేరకు సింగరేణి చేపట్టిన సోలార్ ప్లాంట్ల నిర్మాణాలను ఒప్పందం ప్రకారం సకాలంలో పూర్తి చేయాలని, నిర్మాణ పనులపట్ట నిర్లక్ష్యం వహించే ఏజెన్సీల కాంట్రాక్టులు రద్దు చేస్తామని, అవసరమైతే వారిని బ్లాక్ లిస్ట్‌లో కూడా పెడుతామన్నారు. ఇందుకు సంబంధించి గురువారం సింగరేణి భవన్లో సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మొదటి దశలో ఇంకా పూర్తికావాల్సిన 54.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం, రెండో దశలో 67.5 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్ల నిర్మాణాలు నిర్దేశిత సమయంలో పూర్తి చేయకుండా, తీవ్ర జాప్యం చేస్తున్న నిర్మాణ ఏజెన్సీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బిల్లుల చెల్లింపుల విషయంలో జాప్యం లేనప్పటికీ, నిర్మాణ సంస్థలు తమ పనులను సకాలంలో పూర్తి చేయకపోవడం శోచనీయమని తెలిపారు. ఇకనైనా అప్పగించిన పనులను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని, ఆ తర్వాత గడువు పొడిగింపు ఉండబోదని సీఎండీ స్పష్టం చేశారు.