ప్రపంచ మార్కెట్లో తయారీ హబ్‌గా ఎన్నో ఏండ్ల నుంచి పేరుగాంచిన చైనా.. ఆ హోదాను అంత సులభంగా వదులుకుంటుందా?
అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో భారత్‌కు అందివస్తున్న అవకాశాలను చూసి ఊరుకుంటుందా?
మోదీ సర్కారు మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలను డ్రాగన్ కంట్రీ వ్యూహాత్మకంగా దెబ్బ తీస్తుండటాన్ని చూస్తే ఇప్పుడివే ప్రశ్నలు తలెత్తుతున్నాయి మరి.
న్యూఢిల్లీ, జూలై 3: కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు గొప్పగా ప్రకటించుకున్న ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యానికి చైనా వ్యూహాత్మకంగా గండి కొడుతున్నది. అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో డ్రాగన్ కంట్రీ నుంచి భారత్‌కు మకాం మార్చాలనుకుంటున్న విదేశీ సంస్థలకు జిన్‌పింగ్ ప్రభుత్వం తెలివిగా చెక్ పెడుతున్నది. ఇన్నాళ్లూ ఐఫోన్ల తయారీకి పొరుగు దేశంపై ఆధారపడిన యాపిల్.. కొంతకాలం నుంచి భారత్‌పై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక్కడి ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో ఐఫోన్ల తయారీ ఊపందుకున్నది. అయితే ఇప్పుడు ఫాక్స్‌కాన్ యూనిట్ నుంచి ఏకంగా 300 మందికిపైగా చైనా ఇంజినీర్లు వెళ్లిపోతున్నారు. ఇది ఎప్పుడూ జరిగే మార్పు కంటే చాలా ఎక్కువగా ఉండటం ఇప్పుడు మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది.
ఓవైపు అమెరికాతో ట్రేడ్ వార్.. మరోవైపు భారత్‌తో సరిహద్దు సమస్యలున్న తరుణంలో చైనా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నది. ఈ క్రమంలోనే ఇప్పటికే అరుదైన ఖనిజాల ఎగుమతిపై నిషేధాజ్ఞలు విధించిన జిన్‌పింగ్ ప్రభుత్వం.. అక్కడి నిపుణులు భారత్, వియత్నాం తదితర దేశాల్లో పనిచేస్తుంటే వెనక్కి పిలవాలని కూడా ఆ దేశ కంపెనీలను, రెగ్యులేటర్లకు స్పష్టం చేసింది. తద్వారా తమకు పోటీగా వచ్చే దేశాల్లో నైపుణ్యాభివృద్ధిని అడ్డుకోవాలని భావిస్తున్నది. నిజానికి అమెరికాకు చెందిన యాపిల్.. భారత్‌కు తరలిపోతే, ఆ తర్వాత చైనాలోని ఎన్నో అమెరికన్ టెక్నాలజీ కంపెనీలూ అదే దారిలో క్యూ కడుతాయి. అందుకే పరిస్థితి చేయి దాటకముందే చైనా అప్రమత్తమైందన్న అభిప్రాయాలు ఇప్పుడు అంతటా వినిపిస్తున్నాయి. అయితే ఇదిప్పుడు మేక్ ఇన్ ఇండియాకు శరాఘాతమవుతున్నది.
టెక్నాలజీ, ఫార్మా, రక్షణ, ఆటో తదితర రంగాల్లో భారత్ పెట్టుకున్న అభివృద్ధి ఆశల్ని చైనా చిదిమేస్తున్నది. భారత్‌కు వద్దామనుకున్న అక్కడి విదేశీ సంస్థల ప్లాన్లకు ఒక్కసారిగా చైనా వ్యూహాలు బ్రేకులు వేశాయనే చెప్పవచ్చు మరి. ఇక అమెరికా-చైనా మధ్య కుదురుకుంటున్న పరిస్థితులు సైతం అక్కడి విదేశీ సంస్థల్లో భారత్‌పట్ల ఇంతకుముందున్న ఆసక్తిని తగ్గించేస్తున్నాయి.
2026కల్లా భారత్‌లో ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని అమెరికాకు చెందిన యాపిల్ భావిస్తున్నది. ట్రంప్ హయాంలో చైనాను నమ్ముకుంటే ఎప్పటికైనా ఏ రకంగానైనా ఇబ్బందేనని భావిస్తున్న యాపిల్.. భారత్‌ను ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నది. ఈ క్రమంలోనే తమ ప్రధాన భాగస్వామి ఫాక్స్‌కాన్‌కు చెందిన భారతీయ ప్లాంట్లలో ఐఫోన్ల అసెంబ్లింగ్‌ని వేగవంతం చేస్తున్నది. అయితే ఈ ప్లాంట్ల నుంచి ఒక్కసారిగా 300 మందికిపైగా చైనా ఇంజినీర్లు, టెక్నీషియన్లను ఆ దేశం వెనక్కి పిలిచింది.
దీని వెనుక జిన్‌పింగ్ సర్కారు ఆదేశాలున్నట్టు సమాచారం. భారత్‌లో ఐఫోన్ల తయారీకి చైనా ఇంజినీర్లు, ఇతర సాంకేతిక నిపుణులే కీలకం. పైగా భారత్‌లో ఉద్యోగాల్లోకి తీసుకున్న స్థానికుల్లో నైపుణ్యాల పెంపునకు అవసరమైన శిక్షణ ఇచ్చేది కూడా చైనా నిపుణులే. దీంతో ఉత్పత్తితోపాటు ఇక్కడి ఉద్యోగావకాశాలకూ బ్రేక్ పడ్టట్టు అవుతున్నది. నిజానికి రెండు నెలల క్రితం నుంచే భారత్ నుంచి చైనాకు ఎక్స్పర్ట్స్ తరలిపోతున్నట్టు బ్లూంబర్గ్ చెప్తున్నది. వీరిలో తైవాన్‌కు చెందినవారే పెద్ద ఎత్తున ఉండటంతో అసలుసిసలైన నైపుణ్యం వీడుతున్నదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.