Rafale Fighter Jets | ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో మరో కీలక ముందడుగు పడింది. భారత వైమానిక దళానికి వెన్నెముకగా నిలుస్తున్న రఫేల్ యుద్ధ విమానాలకు (Rafale Fighter Jets) సంబంధించిన విడిభాగాల ఉత్పత్తి ఇకపై భారత్‌లోనే తయారు చేయనున్నారు. ఇందుకు హైదరాబాద్ కేంద్రంగా నిలవడం విశేషం. ఈ మేరకు ఫ్రాన్స్‌కు చెందిన రఫేల్ మాతృ సంస్థ డసో ఏవియేషన్ (Dassault Aviation), టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (టీఏఎస్ఎల్) మధ్య కీలక ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందం ప్రకారం.. ఇకపై రఫేల్ యుద్ధవిమానాలకు చెందిన ప్రధాన భాగాలు హైదరాబాద్‌లోని టీఏఎస్ఎల్ (Tata Advanced Systems Limited)లో తయారవుతాయి. రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్ విడిభాగాలు ఫ్రాన్స్ వెలుపల తయారు కావడం ఇదే తొలిసారి. 2028 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ విడిభాగాల ఉత్పత్తిని ప్రారంభించాలని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లను సంస్థ వేగవంతం చేయనుంది. నెలకు రెండు ఫ్యూజ్‌లేజ్‌లను అందించనుంది.
భారత రక్షణ రంగ చరిత్రలో ఈ ఒప్పందం ఓ మైలురాయిగా నిలుస్తుందని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెట్ సీఎండీ సుకరన్ సింగ్ తెలిపారు. మరోవైపు ఈ ఒప్పందంపై డసో ఏవియేషన్ ఛైర్మన్ అండ్ సీఈఓ ఎరిక్ ట్రాపియర్ మాట్లాడుతూ.. ‘భారత్‌లో మా ఉత్పత్తిని బలోపేతం చేయడంలో ఇది కీలక అడుగు. భారత రక్షణ రంగంలో మా సేవలను విస్తరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ నిర్ణయం రఫేల్ విస్తరణకు మరింత దోహదం చేస్తుంది. అంతేకాదు, నాణ్యమైన సేవలు అందిస్తూ.. సైనిక అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడుతుంది’ అని పేర్కొన్నారు.
Also Read..
RCB | తొక్కిసలాట మృతులకు ఆర్థిక సాయం.. కీలక ప్రకటన చేసిన ఆర్సీబీ
Delhi court | సాకేత్ కోర్టులో ఖైదీ దారుణ హత్య
Sharmishta Panoli: హైకోర్టులో ఊరట.. శర్మిష్టకు తాత్కాలిక బెయిల్