Investors Wealth | గత ఐదు సెషన్లలో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు రూ.16.97 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అంతర్జాతీయంగా టారిఫ్ యుద్ధం ప్రారంభం కావడం, దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు ఎడతెరిపి లేకుండా పెట్టుబడుల ఉపసంహరణకు ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీన పడింది. గత ఐదు సెషన్లలో బీఎస్ఈ సెన్సెక్స్ 2,290.21 పాయింట్లు (2.91 శాతం) నష్టపోయింది. మంగళవారం ఒక్కరోజే బీఎస్ఈ- 30-సెన్సెక్స్ 1,018.20 పాయింట్లు (1.32 శాతం) నష్టంతో ముగిసింది. ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సంపదగా భావిస్తున్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గత ఐదు సెషన్లలో రూ.16,97,903.48 కోట్లు పతనమై రూ.4,08,52,922.63 కోట్లకు (4.70 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. మంగళవారం ఒక్కరోజే రూ.9,29,651.16 కోట్ల మదుపర్ల సంపద హరించుకుపోయింది.
మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్) ప్రశాంత్ తాప్సే మాట్లాడుతూ..‘రోజురోజుకు టారిఫ్ వార్ పెరుగుతుండగంతో ఈక్విటీ మార్కెట్లలోఇన్వెస్టర్లు వాటాల విక్రయానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఒకశాతానికి పైగా నష్టపోయాయి’ అని పేర్కొన్నారు.
బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్‌లో జొమాటో షేర్ ఐదు శాతానికి పైగా నష్టపోయింది. టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, పవర్ గ్రిడ్, లార్సెన్ అండ్ టర్బో, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్), ఐటీసీ తదితర స్టాక్ నష్టపోగా, భారతీ ఎయిర్టెల్ మాత్రమే లాభాలతో ముగిసింది. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.40 శాతం, మిడ్ క్యాప్ 2.88 శాతం చొప్పున నష్టపోయాయి.
‘అమెరికా వాణిజ్య పాలసీ, టారిఫ్‌ల పెంపుపై కొనసాగుతున్న అనిశ్చితికి తోడు దేశ వృద్ధిరేటుపై ఆందోళన, నిరంతరాయంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల వాటాల విక్రయంతో మార్కెట్లో సెంటిమెంట్ బలహీన పడింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు గణనీయంగా నష్టపోయాయి’అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
అన్ని బీఎస్ఈ సెక్టోరల్ ఇండెక్స్‌లు నష్టాలతో ముగిశాయి. రియాల్టీ 3.14 శాతం, ఇండస్ట్రీయల్స్ 2.87 శాతం, కన్జూమర్ డిస్క్రిషనరీ 2.73 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.59 శాతం, ఆటో 2.49 శాతం, మెటల్ 2.23 శాతం నష్టపోయాయి. బీఎస్ఈలో 3,478 స్టాక్స్ నష్టపోగా, 525 స్టాక్స్ లబ్ధి పొందాయి. మరో 94 స్టాక్స్ యధాతథంగా కొనసాగాయి.