బెంగళూరు, నవంబర్ 10 : డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, గ్రూప్ ఫార్మాస్యూటికల్స్ మధ్య లావాదేవీల్లోకి సైబర్ మోసగాళ్లు చొరబడి రూ.2.16 కోట్లు కాజేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెంగళూరుకు చెందిన గ్రూప్ ఫార్మాస్యూటికల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కే మహేశ్ బాబు స్థానిక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం.. రెడ్డీస్ ల్యాబ్‌కు సరఫరా చేసిన గూడ్స్‌కు సంబంధించి గ్రూప్ ఫార్మాకు రూ.2.16 కోట్లు రావాల్సి ఉన్నది. అయితే దీన్ని పసిగట్టిన కేటుగాళ్లు..
ఈ నెల 3న రెడ్డీస్ ఫైనాన్స్, అకౌంట్స్ విభాగాలకు గ్రూప్ ఫార్మా పేరిట మోసపూరిత ఈ-మెయిల్స్ పంపించి తప్పుడు బ్యాంక్ ఖాతాల వివరాలిచ్చారు. ఆ ఖాతాల్లోకి ఈ నెల 4న రెడ్డీస్ నగదు పంపించింది. విషయం తెలుసుకున్న గ్రూప్ ఫార్మా.. దీనిపై ఈ నెల 5న పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుంటే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్.. ఈ మోసాన్ని వెంటనే గుర్తించామని, బ్యాంక్ అధికారులకు చెప్పి నగదు బదిలీ కాకుండా ఆపించగలిగామని తెలిపింది. మరోవైపు సదరు మోసపూరిత ఖాతా గుజరాత్‌లోని వడోదరకు చెందినదిగా పోలీసులు గుర్తించారు.