Cigarettes Smuggling | విదేశాల నుంచి అక్రమ మార్గాల్లో దిగుమతి చేసుకున్న 12.22 లక్షల సిగరేట్లను ఢిల్లీ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.2 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. విదేశాల్లో తయారీ చేసిన సిగరెట్లకు వ్యతిరేకంగా ఢిల్లీ కస్టమ్స్ ప్రివెంటివ్ అధికారులు ఈ నెల 20,21 తేదీల్లో కేసు నమోదు చేశారని కేంద్ర ఆర్థికశాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. అక్రమ మార్గాల్లో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న సిగరెట్లను నిల్వ చేశారని కూడా పేర్కొంది.
దేశ రాజధాని పరిధిలోని కత్రా బారియన్, నయాబాన్స్, ఢిల్లీ-06 ప్రాంతాల్లో గల రెండు షాపులు, మూడు గోడౌన్లలో ఢిల్లీ కస్టమ్స్ ప్రివెంటివ్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ షాపులు, గోడైన్లలో ఈఎస్ఎస్ఈ, మాండ్, డన్ హిల్, డేవిడ్ ఆఫ్, గుడాంగ్ గరం, ప్లాటినం సెవెన్ తదితర బ్రాండ్ల పేరుతో గల సిగరెట్లు 12.22 లక్షలు ఉన్నాయని, ప్రాథమిక అంచనా ప్రకారం వీటి విలువ రూ.2 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. సదరు సిగరెట్ల అసలు విలువ అంచనా ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు.
ఆ సిగరెట్లు, సిగరెట్ ప్యాకెట్లపై ఎటువంటి ఆరోగ్యపరమైన హెచ్చరికలు లేవని కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది. ఈ సిగరెట్లపై కస్టమ్స్ చట్టం-1962 ప్రకారం పన్ను విధించాల్సి ఉంటుందని తెలిపింది. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు (ప్యాకేజింగ్ అండ్ లేబులింగ్) సవరణ నిబంధనలు -2022లను ఉల్లంఘిస్తూ, కస్టమ్స్ డ్యూటీ ఎగవేతకు పాల్పడుతూ, దేశీయంగా పంపిణీ చేస్తున్నారని వివరించింది. వీటి స్మగ్లింగ్‌లో సరఫరాదారులు, డీలర్లు, ఇతర వాటాదారుల పాత్రపై విచారణ జరుగుతుందని, తదుపరి కేసు దర్యాప్తు కొనసాగుతుందని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది.