Chidambaram | వచ్చే ఆర్థిక సంవత్సరా (2025-26)నికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత పీ చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మలా సీతారామన్‌కు జ్యోతిష్య శాస్త్రం మీద నమ్మకం ఉన్నట్లు కనిపిస్తుందని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ‘2025-26లో పెట్టుబడి వ్యయం రూ.1,02,661 కోట్లు పెంచారు. కానీ, 2024-25లోనూ ఇదే జరిగింది. లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రభుత్వ సామర్థ్యంపైనే నాకు డౌట్’ అని వ్యాఖ్యానించారు.
బడ్జెట్ అంచనాల్లో ద్రవ్యలోటు 4.9శాతానికి తగ్గించాలని ప్రతిపాదిస్తే సవరించిన అంచనాల్లో 4.8 శాతానికి మాత్రమే తగ్గిందని, ఇందులో చెప్పుకోదగిన పురోగతేమీ లేదని చిదంబరం పేర్కొన్నారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు భారీ మూల్యాన్ని మిగులుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ పథకాలకు నిధుల కేటాయింపులు తగ్గాయని గుర్తు చేసిన చిదంబరం.. ఆయా పథకాల అమలు విషయమై కేంద్రానికి ఉన్న సామర్థ్యం ఏమిటో తెలుస్తోందన్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల సంక్షేమానికి నిధులు నిర్దాక్షిణ్యంగా తగ్గించేశారని ఆరోపించారు.
1991లో ఆర్థిక మంత్రిగా, 2004లో అప్పటి ప్రధానిగా మన్మోహన్ సింగ్ అమలు చేసిన విధానాలనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనుసరిస్తున్నారని చిదంబరం పేర్కొన్నారు. కొత్త విధానాలేమీ లేవని ఎద్దేవా చేశారు. 3.2 కోట్ల మంది మధ్యతరగతి ప్రజలకు ఆదాయం పన్ను మినహాయింపు రిలీఫ్, ఏడాది చివరల్లో ఎన్నికలు జరిగే 7.65 కోట్ల మంది బీహారీల మనస్సు గెలుచుకోవడంపైనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఫోకస్ చేశారన్నారు. మిగతా దేశ ప్రజలకు కేవలం ఓదార్పు మాటలకు పరిమితమైనా ప్రధాని నరేంద్రమోదీ సహా బీజేపీ ఎంపీలు బల్లలు చరిచారని చిదంబరం వ్యాఖ్యానించారు.