CRISIL- Crude Oil | దేశీయ అవసరాలకు సరిపడా పెట్రోల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఖజానాపై భారం పెరుగుతుందని ప్రముఖ రేటింగ్స్ సంస్థ ‘క్రిసిల్’ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో సగటున బ్యారెల్ క్రూడాయిల్ ధర 83 డాలర్లు పలికితే, ఈ ఏడాది (2024-25)లో సరాసరి 83 నుంచి 88 డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. దేశీయ అవసరాలకు 80 శాతానికి పైగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీనివల్ల పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగితే దిగుమతి బిల్లు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర గత నెలలో సగటున 82.6 డాలర్లు వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఏడాదికేడాది 10.2 శాతం, నెలవారీగా 0.7 శాతం ముడి చమురు ధర పెరుగుతోంది. మరోవైపు, దేశీయ జీడీపీలో ద్రవ్యలోటును 5.1 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు 5.6 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో ద్రవ్యలోటు అంచనాలకు అనుగుణంగానే మూడు శాతం వద్ద కొసాగుతున్నది. గతేడాదితో పోలిస్తే 11.8 శాతం గణనీయంగా తగ్గిందని క్రిసిల్ తెలిపింది. జీడీపీలో కరంట్ ఖాతా లోటు (క్యాడ్) సగటున 1.0 శాతం ఉంటుంది. గతేడాది (2023-24) 0.7 శాతంగా ఉంది.