న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. గురువారం ఒక దశలో బ్యారెల్ క్రూడాయిల్ రేటు ఏకంగా నాలుగేండ్ల గరిష్ఠాన్ని తాకుతూ 126 డాలర్లు పలికింది. 2022 తర్వాత మళ్లీ బ్రెంట్ ముడి చమురు పీపా విలువ ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. దీంతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అటు స్టాక్ మార్కెట్లు.. ఇటు కరెన్సీ మార్కెట్లు ఒక్కసారిగా షేక్ అయ్యాయి. స్పాట్ మార్కెట్‌తోపాటు ఫ్యూచర్ మార్కెట్లలోనూ క్రూడ్ రేట్లు పరుగులు పెట్టాయి.
ఇరాన్ నౌకాశ్రయాలను దిగ్బంధించిన అమెరికా.. మరికొంతకాలం ఇదే తీరును కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ ప్రతిపాదనలకూ అగ్రరాజ్య అధ్యక్షుడు ససేమిరా అంటున్నారు. దీంతో క్రూడాయిల్ రేట్లు విజృంభించాయి. నిజానికి ఫిబ్రవరి ఆఖర్లలో అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మొదలు కాకముందు బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ రేటు సుమారుగా 70 డాలర్లే. కానీ ఇప్పుడు 45-50 డాలర్ల మేర పెరిగింది. ప్రస్తుతం 114 డాలర్ల వద్ద కదలాడుతున్నది. అటు ఫ్యూచర్ మార్కెట్లో జూన్ డెలివరీకిగాను 121.90 డాలర్లు పలికితే.. జూలైకి మాత్రం 112.02 డాలర్లుగానే ట్రేడైంది. అమెరికా క్రూడ్ బెంచ్‌మార్క్ సైతం బ్యారెల్ 108.28 డాలర్లను సూచిస్తున్నది. దీంతో మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు కొనసాగితే.. ముడి చమురు రేట్లు మరింత వేగాన్ని అందుకుంటాయన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
పెరుగుతున్న ముడి చమురు ధరలు.. అనుబంధ రంగాలను దెబ్బతీస్తున్నాయి. ఎరువులు, రంగులు, సబ్బులు, ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్ తదితర ఇండస్ట్రీలు పెద్ద ఎత్తున ప్రభావితమవుతున్నాయి. ఇరాన్ యుద్ధం రెండు నెలలుగా జరుగుతుండటంతో ఇప్పటికే రిటైల్ మార్కెట్లో ఆయా ఉత్పత్తుల ధరల్ని కంపెనీలు పెంచేశాయి కూడా. వివిధ రకాల సబ్బులు, రంగులు, ఎరువుల రేట్లు ప్రత్యక్షంగా.. మిగతా వాటి ధరలు పరోక్షంగా పెరుగడంతో వినియోగదారులపై ఆ భారం పడుతున్నది. మొత్తానికి ఇంధన ధరల్లో పెరుగుదల ఓవైపు.. పెరిగిన రవాణా ఖర్చులు మరోవైపు ఇండస్ట్రీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. హెచ్‌యూఎల్..తన సబ్బుల ధరలను ఇప్పటికే 3 శాతం నుంచి 5 శాతం వరకు పెంచింది. తాజాగా మరోసారి పెంచడానికి సిద్ధమవుతున్నట్టు కంపెనీ సీఈవో, ఎండీ ప్రియా నాయర్ సంకేతాలిచ్చారు. ఉత్పత్తి వ్యయం అధికం కావడంతోపాటు సంస్థపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ధరల పెంపు అనివార్యమైందని వెల్లడించారు.
ఐస్‌క్రీం, చాక్లెట్లు కూడా ప్రియంకాబోతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఐస్‌క్రీం, చాక్లెట్ల తయారీ సంస్థలు అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న వస్తువుల ర అధికం కావడంతో సంస్థలపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ధరలు పెంచడానికి సిద్ధమవుతున్నాయి. వీటికి తోడు నిర్వహణ ఖర్చులు అధికం కావడం, సరఫరా మరింత ఆలస్యం కావడం కూడా మరో కారణాలని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. యుద్ధం ప్రభావంతో బాదం, జీడిపప్పు, కొకొ, ఇతర డ్రైఫ్రూట్స్ ధరలు 15 శాతం నుంచి 22 శాతం వరకు అధికమయ్యాయి.
అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు పెరిగితే.. భారతీయ ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ఇందులో మెజారిటీ వాటా సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ తదితర గల్ఫ్ దేశాలదే. ఈ క్రమంలో అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చే ముడి చమురుకు బ్రేకులు వేసింది. ముఖ్యంగా హొర్ముజ్ జలసంధిలో రవాణా ఆగిపోయింది. ఇది చమురు దిగుమతులపైనే ఆధారపడిన భారత్‌ను కలవరపెడుతున్నది. ఇరాన్ వార్.. ఎన్నో రకాలుగా దేశ ఆర్థిక ప్రగతికి ప్రతిబంధకంగా మారుతున్నది మరి.
అంతర్జాతీయంగా బ్యారెల్ ముడి చమురు ధర 10 డాలర్లు పెరిగితే.. దేశీయంగా దిగుమతి బిల్లు 17-18 బిలియన్ డాలర్లు పెరుగుతుంది.
పెరిగే చమురు దిగుమతుల బిల్లు.. దేశంలోని విదేశీ మారక ద్రవ్యనిల్వల్ని తగ్గించేస్తుంది. చివరకు వాణిజ్య లోటు ఎగిసి కరెంట్ ఖాతా లోటుకు దారితీస్తుంది. దీన్ని అధిగమించడానికి విదేశీ అప్పుల కోసం తిరుగాల్సి వస్తుంది.
సరిపడా ముడి చమురు నిల్వల దిగుమతికి అవసరమైన డాలర్లకు డిమాండ్ పెరుగుతుంది. దీనివల్ల సహజంగానే రూపాయి మారకం విలువ పడిపోతుంది.
పెరిగే ముడి చమురు ధరలు.. రవాణా వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అధిక ఇంధన ధరలు.. ప్రతి వస్తూత్పత్తి సరఫరాకయ్యే ఖర్చుల్ని పెంచేస్తాయి. దీంతో ద్రవ్యోల్బణం విజృంభిస్తుంది.
ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా దేశంలో ద్రవ్య విధానాన్ని సవరిస్తున్న ఆర్బీఐ.. కీలక వడ్డీరేట్లను పెంచేస్తుంది. దీంతో బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ రుణాల లభ్యత కష్టంగా మారుతుంది. తయారీ మందగమనం రుణ సాయం లేక వ్యాపార, పారిశ్రామిక రంగాలను ముడి సరుకు కొరత వేధిస్తుంది. కీలకమైన తయారీ రంగంలో మందగమనం నెలకొంటుంది.
ఉత్పాదక రంగంలో ఏర్పడిన నిస్తేజం.. నిరుద్యోగానికి దారితీయగలదు. ఇప్పటికే పెరుగుతున్న సాంకేతికత.. వివిధ రంగాల్లో కొలువుల్ని దూరం చేస్తున్నది.
ద్రవ్యోల్బణం, కఠిన రుణ లభ్యత, కుంటుబడిన తయారీ, నిరుద్యోగం, రుణ భారం సమస్యలతో దేశ జీడీపీ వృద్ధిరేటు పతనం అవుతుంది. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక రకాలుగా భారత్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది.