మార్కెట్లలో అదానీ గ్రూప్ విలయం సృష్టించింది. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ఇప్పటికే బిడ్డింగ్ అయిన ఎఫ్‌పీవోను రద్దుచేసి ప్రకంపనల్ని రేపింది. గత వారం హిండెన్‌బర్గ్ నివేదికతో మొదలైన ఈ సంచలనాలు.. బుధవారం క్రెడిట్ సూసీ రేటింగ్‌తో తారస్థాయికి చేరాయి. ఈ ఒక్కరోజే అదానీ గ్రూప్ మార్కెట్ విలువ దాదాపు రూ.1.72 లక్షల కోట్లు కరిగిపోయింది. ఈ క్రమంలోనే ఎవరూ ఊహించనివిధంగా ఎఫ్‌పీవో రద్దు నిర్ణయాన్ని అదానీ గ్రూప్ తీసుకున్నది. నిజానికి ఈ ఎఫ్‌పీవో మొదలైన దగ్గర్నుంచి గ్రూప్‌నకు వాటిల్లిన నష్టం రూ.7.35 లక్షల కోట్లు. హిండెన్‌బర్గ్ రిపోర్టుతో స్టాక్ మార్కెట్లలో అదానీ సంస్థల షేర్లన్నీ కుప్పకూలిన ఫలితంగా గ్రూప్ మార్కెట్ విలువ పడిపోయింది.. ఫోర్బ్స్ కుబేరుల జాబితాలోనూ గౌతమ్ అదానీ టాప్-10 స్థానం గల్లంతైంది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: అదానీ గ్రూప్ కంపెనీల బాండ్లకు విలువే లేదని ప్రముఖ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ క్రెడిట్ సూసీ అన్నది. ఈ బాండ్లకు జీరో లెండింగ్ వాల్యూను ఇచ్చిందీ అంతర్జాతీయ బ్రోకరేజీ దిగ్గజం. దీంతో స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువ బుధవారం మరోసారి భారీగా పతనమైంది. మంగళవారం అదానీ ఎంటర్ప్రైజెస్ ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో) సంస్థాగతేతర మదుపరుల నుంచి మద్దతు లభించి గట్టెక్కిన విషయం తెలిసిందే. అయితే ఇది జరిగిన మరుసటి రోజే బాండ్లను క్రెడిట్ సూసీ స్క్రూటినీ చేసింది.
ఈ నేపథ్యంలోనే మార్జిన్ లోన్ల కోసం ఈ బాండ్లను అంగీకరించవద్దని తమ ప్రైవేట్ బ్యాంకింగ్ క్లయింట్లకు చెప్పింది. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై అమ్మిన బాండ్ల విలువ ‘శూన్యం’ అని చెప్పింది. ఫలితంగా గ్రూప్ మార్కెట్ విలువ మరో రూ.1.72 లక్షల కోట్లదాకా కరిగిపోయింది. ఇక అమెరికాకు చెందిన ఇన్వెస్టింగ్ పరిశోధక దిగ్గజం హిండెన్‌బర్గ్ గత వారం తమ నివేదికలో అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడిందని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
రూ.7.35 లక్షల కోట్లు ఫట్
ఎఫ్‌పీవో వచ్చిన దగ్గర్నుంచి ఇప్పటిదాకా అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ విలువ రూ.7.35 లక్షల కోట్లు పడిపోయింది. రూ.19.21 లక్షల కోట్ల నుంచి రూ.11.86 లక్షల కోట్లకు దిగొచ్చింది. గ్రూప్ మొత్తం మార్కెట్ విలువలో ఇది 38.26 శాతానికి సమానం కావడం గమనార్హం. ఇక గత ఏడాది డిసెంబర్ ఆఖరు నాటికి రూ.19.63 లక్షల కోట్లుగా అదానీ గ్రూప్ మార్కెట్ విలువ ఉన్నది.
వాస్తవానికి హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ రుణాలపై మదుపరులలోనూ భయాలు మొదలయ్యాయి. కాగా, ఫార్చూన్ ఇండియా వివరాల ప్రకారం ఈ ఏడాది అదానీ గ్రూప్ రూ.2,355 కోట్ల (289 మిలియన్ డాలర్లు) చెల్లింపులు జరుపాల్సి ఉన్నది. బ్లూంబర్గ్ సమాచారం మేరకు 90.75 మిలియన్ డాలర్ల (రూ.744 కోట్లు)వడ్డీ చెల్లింపులు అదానీ ముందున్నాయి. వీటిలో అదానీ పోర్ట్ వాటానే అత్యధికంగా 40.45 మిలియన్ డాలర్లు (రూ.328 కోట్లు). అదానీ ట్రాన్స్మిషన్, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై, అదానీ గ్రీన్, అదానీ ఇంటర్నేషనల్ కంటైనర్లు మిగతా చెల్లింపులు జరుపాలి.
రెండేండ్లలోనే డబుల్
2021, 2022 మధ్య అదానీ గ్రూప్ మార్కెట్ విలువ రెండింతలైంది. రూ.9.62 లక్షల కోట్ల నుంచి రూ.19.63 లక్షల కోట్లకు ఎగబాకింది. ఇక గౌతమ్ అదానీ నాయకత్వంలోని అదానీ గ్రూప్ నికర విలువ దాదాపు 120 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు చెప్పారు. ఇందులో 100 బిలియన్ డాలర్లకుపైగా విలువ గడిచిన మూడేండ్లలో వచ్చినదే. అయితే అదానీ గ్రూప్‌నకు చెందిన, స్టాక్ మార్కెట్లలో నమోదైన 7 ప్రధాన సంస్థల విలువ ఆకాశమే హద్దుగా చూపుతున్నారని హిండెన్‌బర్గ్ కుండబద్దలు కొట్టింది.
ఇంతింత విలువ ఎక్కడిది?..
అదానీ గ్రూప్‌లోని స్టాక్‌మార్కెట్ నమోదిత సంస్థల్లో అన్నింటి విలువ కూడా వీటికి పోటీగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల కంటే చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం. ఉదాహరణకు..
అదానీ టోటల్ గ్యాస్
అదానీ టోటల్ గ్యాస్ విలువ రూ.2.09 లక్షల కోట్లుగా ఉన్నది. దీని ప్రభుత్వ ప్రత్యర్థి సంస్థ ఇంద్రప్రస్థ గ్యాస్ (ఐజీఎల్) మార్కెట్ విలువ రూ.29,676 కోట్లే. సుమారు రూ.1.7 లక్షల కోట్ల వ్యత్యాసం కనిపిస్తున్నది. నిజానికి దేశవ్యాప్తంగా 21 నగరాల్లో ఐజీఎల్ గ్యాస్‌ను సరఫరా చేస్తున్నది. అదానీ టోటల్ కార్యకలాపాలు 11 నగరాల్లో మాత్రమే ఉన్నాయి. మరో ప్రభుత్వ రంగ సంస్థ మహానగర్ గ్యాస్ మార్కెట్ విలువ సైతం రూ.8,699 కోట్లే.
అదానీ ట్రాన్స్మిషన్
అదానీ ట్రాన్స్మిషన్ విలువ రూ.1.92 లక్షల కోట్లుగా ఉన్నది. ఇదే సమయంలో ప్రభుత్వ సంస్థ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ విలువ రూ.1.51 లక్షల కోట్లే. కానీ గత ఆర్థిక సంవత్సరం పవర్‌గ్రిడ్ నికర లాభం రూ.16,745 కోట్లు. మరి అదానీ ట్రాన్స్మిషన్ నికర లాభం రూ.1,235 కోట్లే. అయినా దీని విలువ పవర్‌గ్రిడ్ కంటే 21.3 శాతం ఎక్కువ.
అదానీ పవర్
అదానీ పవర్ ఉత్పాదక సామర్థ్యం 13,650 మెగావాట్లు. దీని ప్రత్యర్థి ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ ఉత్పాదక సామర్థ్యం సుమారు 72,000 మెగావాట్లు. అయినప్పటికీ అదానీ పవర్ విలువ రూ.82,000 కోట్లుగా ఉన్నది. ఎన్టీపీసీ మార్కెట్ విలువ రూ.1.64 లక్షల కోట్లే. 13,650 కోట్ల ఉత్పాదక సామర్థ్యం ఉన్న అదానీ పవర్ మార్కెట్ విలువే అంతుంటే.. ఎన్టీపీసీ మార్కెట్ విలువ ఇంకెంత ఉండాలి?. అయినప్పటికీ ఇదో బేతాళుడి ప్రశ్నే. దీనికి సమాధానం దొరకదు. ఇక ఎన్టీపీసీ నికర లాభం రూ.15,940 కోట్లు. అదానీ పవర్ లాభం రూ.4,911 కోట్లే.
మార్కెట్లపై పిడుగు
స్టాక్ మార్కెట్లపై అదానీ పిడుగుపడింది. గౌతమ్ అదానీకి చెందిన షేర్లు కుప్పకూలడంతో మార్కెట్ల పతనాన్ని శాసించింది. ఇంట్రాడేలో 1,200 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివర్లో 158.18 పాయింట్లు అందుకొని 59,708 వద్ద ముగిసింది.నిఫ్టీ మాత్రం 45.85 పాయింట్లు తగ్గి 17,616.30 వద్ద స్థిరపడింది. బీమా ఉత్పత్తులపై పన్ను విధిస్తుండటంతో బీమా సంస్థల షేర్లు భారీగా నష్టపోయాయి.