ముంబై, జూలై 15: దేశంలో అల్పాదాయ వర్గాల అవసరాలకు క్రెడిట్ కార్డులే దిక్కవుతున్నాయి. నెలకు రూ.50 వేల కంటే తక్కువ సంపాదిస్తున్న ఉద్యోగుల్లో దాదాపు 93 శాతం మంది క్రెడిట్ కార్డులపై ఎక్కువగా ఆధారపడుతున్నట్టు తమ అధ్యయనంలో తేలిందని గ్లోబల్ ఫుల్-స్టక్ డాటా సైన్స్, ఏఐ ఆధారిత సంస్థ థింక్360.ఏఐ మంగళవారం తెలియజేసింది. గడిచిన ఏడాదికిపైగా కాలంలో 20 వేలకుపైగా ఉద్యోగులు, స్వయం ఉపాధితో జీవనం సాగిస్తున్న వ్యక్తుల జీవన శైలి, ఆర్థిక అవసరాలు, అభిప్రాయాల ఆధారంగా ఈ అధ్యయనం రూపొందించినట్టు పేర్కొన్నది. ఈ సందర్భంగా స్వయం ఉపాధితో జీవిస్తున్న 85 శాతం మంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నట్టు చెప్పారు.
మార్కెట్లో కనిపించే ఇప్పుడు కొనండి తర్వాత చెల్లించండి (బై నౌ పే లేటర్ లేదా బీఎన్‌పీఎల్) ఆఫర్లకూ ఎక్కువమంది భారతీయులు ఆకర్షితులవుతున్నట్టు థింక్360.ఏఐ తెలిపింది. స్వయం ఉపాధి పొందుతున్నవారిలో 18 శాతం, వేతనాలపై ఆధారపడిన ఉద్యోగుల్లో 15 శాతం.. బీఎన్‌పీఎల్ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నట్టు వెల్లడించింది. ‘క్రెడిట్ కార్డులు, బీఎన్‌పీఎల్ ఆఫర్లు ఇప్పుడు ప్రతీ ఒక్క భారతీయునికి ఎంతో అవసరంగా మారాయని చెప్పవచ్చు. ఉద్యోగుల నుంచి గిగ్ వర్కర్స్ వరకు వీటిపట్ల డిమాండ్ కనిపిస్తున్నది’ అని థింక్360.ఏఐ వ్యవస్థాపక సీఈవో అమిత్ దాస్ తెలిపారు.
ఫిన్‌టెక్ సంస్థల నుంచి రుణాలకూ మార్కెట్లో బాగానే గిరాకీ ఉందని తాజా అధ్యయనంలో స్పష్టమైంది. 2022-23లో ఫిన్‌టెక్స్ రూ.92 వేల కోట్లకుపైగా వ్యక్తిగత రుణాలను ఇచ్చినట్టు తెలిపింది. ఇది కొత్తగా మంజూరైన అన్ని రుణాల్లో 72 శాతమని వివరించింది.