మాదాపూర్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో బూమ్ రాబోతున్నదని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో ‘తెలంగాణ గోయింగ్ గ్లోబల్’ థీమ్‌తో మంగళవారం క్రెడాయ్ స్టేట్‌కాన్ 2024 సమావేశం జరిగింది. దీనికి మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలతోపాటు భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు ప్రేమ్‌సాగర్ రెడ్డి, చైర్మన్ మురళీకృష్ణా రెడ్డి, ప్రెసిడెంట్-ఎలెక్ట్ కే ఇంద్రసేనా రెడ్డి, ఐజీబీసీ జాతీయ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డిలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. నిర్మాణ రంగంలో జరుగుతున్న అభివృద్ధికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు రూ.10 వేల కోట్లను కేటాయించడం జరిగిందని తెలిపారు. తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. భవన, నిర్మాణ రంగాభివృద్ధికి సహకరిస్తామన్న ఆయన.. రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా రూపాంతరం చెందుతున్నదని వివరించారు.
దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ.. ఇంత త్వరితగతిన పురోగతి సాధించడం గొప్ప విషయమంటూ ఈ సందర్భంగా గత పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వ పాలనను పరోక్షంగా మంత్రి ఉత్తమ్ అభినందించడం గమనార్హం. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రపంచ స్థాయికి ఎదగడానికి ఎంతో సమయం పట్టదని ఆయన చెప్పారు. తెలంగాణ వృద్ధిరేటుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్నదని గుర్తుచేశారు. కాగా, రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని విశ్లేషిస్తూ సీబీఆర్ఈ ఈ సందర్భంగా ఓ రిసెర్చ్ రిపోర్టును విడుదల చేసింది.