Cheapest E-car | దేశంలోనే అత్యంత చవకౌన కారు మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ పీఎంవీ ఈ కార్లను ఉత్పత్తి చేస్తున్నది. ఈ కార్ల ప్రీ-బుకింగ్‌లను కూడా కంపెనీ అధికారికంగా ప్రారంభించింది. కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా రూ. 2,000 చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ.4.79 లక్షల నుంచి ప్రారంభం అవుతున్నది. తొలి 10 వేల మంది వినియోగదారులకు మాత్రమే ఈ ధరతో కార్లను అందించేందుకు పీఎంవీ సంస్థ ముందుకొచ్చింది. ఈ కారును నడపడానికి కిలోమీటర్‌కు 75 పైసలు మాత్రమే ఖర్చవుతుందని కంపెనీ పేర్కొన్నది.
ఈ కారులో 10 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ ఉంటుంది. ఇది దాదాపు 20 హార్స్పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయ్యేందుకు దాదాపు 4 గంటల సమయం పట్టనున్నది. ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120-200 కిలో మీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 70 కిలోమీటర్లు.
పీఎంవీ సంస్థ 11 రంగుల్లో తమ ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తేనున్నది. రీజెనరేటివ్ బ్రేకింగ్, రిమోట్ పార్కింగ్ అసిస్ట్, ఓటీఏ అప్డేట్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి అనేక ఫీచర్లు ఈ కారులో అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ద్వారా కారులోని ఏసీ, హారన్, విండోస్, లైట్లను ఆపరేట్ చేయవచ్చు. అయితే, టాటా నానో కారును పోలి ఉన్న ఈ కారులో ఇద్దరు మాత్రమే ప్రయాణించేందుకే వీలుంటుంది.