Home Loan | ప్రతి ఒక్కరికి సొంతిల్లు కట్టుకోవాలని.. అలా వీలుకాకపోతే అపార్ట్మెంట్ ప్లాట్ కొనుక్కోవాలని ఉంటుంది. ఇల్లు నిర్మించుకోవాలని భావించేవారు తొలుత అందుకు అవసరమైన ప్లాట్ (స్థలం) కొనుక్కోవాలి. అలా ప్లాట్ కొనుక్కోవడానికి కూడా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలిస్తూ ఉంటాయి. ఫ్లాట్ ఉన్న స్థలం, రుణ గ్రహీత సిబిల్ స్కోర్, వార్షిక ఆదాయం, ఇప్పటికే తీసుకున్న రుణాలపై ఈఎంఐ చెల్లింపు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని బ్యాంకులు రుణాలిస్తాయి.
సాధారణంగా ప్లాట్ విలువలో 80 శాతం వరకు స్థలం కొనుగోలుకు లోన్ ఇస్తాయి. ఈ రుణ నిబంధనలు బ్యాంకుల వారీగా వేర్వేరుగా ఉంటాయి. కొన్ని బ్యాంకులు వీటినే హోం లోన్ కింద పరిగణిస్తే.. మరికొన్ని బ్యాంకులు తప్పనిసరిగా ఇల్లు నిర్మిస్తామంటేనే లోన్ శాంక్షన్ చేస్తుంటాయి.
కొందరు తక్కువ వడ్డీకి వచ్చే రుణంపై ప్లాట్ కొని, కొన్నాళ్లకు లాభానికి అమ్మేసి బ్యాంకు రుణం తీర్చేస్తుంటారు. ఇలా చేయడం నిబంధనలకు వ్యతిరేకంగా. దేశంలో ప్రతి ఒక్కరికీ సొంతింటి వసతి కల్పించడానికి కేంద్రం, ఆర్బీఐ హోంలోన్ (ప్లాట్ లేదా రియాల్టీ రుణం మంజూరు చేయడానికి బ్యాంకులకు అనుమతి ఇచ్చాయి. కానీ, కొందరు స్వలాభం కోసం తక్కువ వడ్డీకి వచ్చే బ్యాంకు రుణాలను వాడుకోవడం చట్ట వ్యతిరేకం అని నిపుణులు అంటున్నారు.
వేతన జీవులు, స్వయం ఉపాధి పొందుతున్న వారికే బ్యాంకులు.. ప్లాట్ రుణాలిస్తుంటాయి. ఇవి రిస్కుతో కూడుకున్న లోన్లు. ప్లాట్ కొన్న కొన్నాళ్ల తర్వాత బ్యాంకుకు సమాచారం ఇవ్వకుండానే నకిలీ పత్రాలను తయారీ చేసి ఆ స్థలాలు విక్రయిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అందువల్లే ప్లాట్ కం ఇంటి రుణం మంజూరు విషయంలో బ్యాంకులు చాలా అలర్ట్‌గా ఉంటాయి. అన్ని రకాలుగా ధ్రువీకరించుకున్నాకే బ్యాంకులు.. ఈ ప్లాట్ లోన్ ఇస్తాయి. భూమి టైటిల్ డీడ్, సేల్, నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తదితర పత్రాలు పరిశీలిస్తాయి.
గరిష్టంగా 80 శాతం రుణం ఇచ్చే బ్యాంకులు పలు అంశాలు పరిగణనలోకి తీసుకుంటాయి. రుణ గ్రహీతలు నెలవారీగా ఎంత మొత్తం ఈఎంఐ చెల్లించగల సామర్థ్యం కలిగి ఉన్నారు.. ఇప్పటివరకు ఉన్న రుణాలేంటి? క్రెడిట్ చరిత్ర, వారి వార్షికాదాయం, తదితర అంశాలనూ పరిశీలిస్తాయి. సీల్ డీడ్‌లో పేర్కొన్న ధరనే బ్యాంకులు ప్లాట్ ధరగా నిర్ణయిస్తాయి. సీల్ డీడ్‌లో పేర్కొన్న ధర కంటే మార్కెట్ ధర కొన్ని రెట్లు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకులు తమ సొంత అధీక్రుత సంస్థల ద్వారా కూడా ప్లాట్ విలువ ఖరారు చేస్తుంటాయి.
ప్లాట్ రుణానికి కూడా ఇంటి లోన్ వడ్డీరేట్లను వర్తింప జేస్తాయి బ్యాంకులు. ఇల్లు కట్టుకుంటారన్న నమ్మకంతోనే తక్కువ వడ్డీకే ఇండ్ల రుణాలిస్తాయి. ఇంటి నిర్మాణానికి బ్యాంకులు కొంత గడువు పెడతాయి. సకాలంలో నిర్మాణ పనులు పూర్తి చేసి, పత్రాలు సమర్పిస్తేనే తక్కువ వడ్డీరేటు అమలవుతుంది. లేదంటే సాధారణ రుణం కింద మార్చేసి వడ్డీ రేటు పెంచేయడంతోపాటు ఆ వడ్డీ రేటు రుణం తీసుకున్నప్పటి నుంచి వర్తింపజేస్తాయి.
కొనుగోలు చేసిన ప్లాట్ మధ్యలో విక్రయించడానికి బ్యాంకులు అనుమతించవు. కొన్ని బ్యాంకులు మాత్రం ప్లాట్ కొనుగోలుకు మాత్రమే అనే రూల్ కింద రుణం ఇస్తాయి. అది రుణం మంజూరు చేసే బ్యాంకు, రుణ గ్రహీత మధ్య కుదిరిన అగ్రిమెంట్ ఆధారంగా మధ్యలో విక్రయానికి వీలవుతుంది. అలా కాకుండా సాధారణంగా ప్లాట్ కొనుగోలు చేస్తే ఇల్లు కట్టుకోవాల్సిందే.
అయినా కొందరు వ్యక్తులు.. బ్యాంకు అధికారుల కండ్లు గప్పి.. సదరు ప్లాట్లు విక్రయించేస్తున్నారు. దీన్ని అడ్డుకోవడానికి సేల్ డీడ్ పత్రాలను బ్యాంకులు తమ వద్ద హామీ (గ్యారంటీ)గా పెట్టుకుంటాయి. సేల్ డీడ్ లేకుండా సదరు స్థలం విక్రయించడానికి వీలు కాదు. అలా కాకుండా నకిలీ పత్రాలతో విక్రయిస్తే.. చట్టరీత్యా బ్యాంకులు చర్య తీసుకోవచ్చునని ఆర్థికవేత్తలు, నిపుణులు చెబుతున్నారు. కనుక ఇల్లు కట్టుకోవాలనుకుంటే మాత్రమే స్థలం కొనుగోలుకు రుణం తీసుకోవాలని చెబుతున్నారు.