ఆదివారం 31 మే 2020
Business - May 16, 2020 , 03:00:55

జిత్తులమారి ట్రంప్‌

జిత్తులమారి ట్రంప్‌

  • భారత్‌కు యాపిల్‌ రాకుండా అడ్డుకునేందుకు కుట్ర
  • కొత్త పన్నులు వేస్తామంటూ హెచ్చరికలు
  • చైనా నుంచి కదిలితే అమెరికాకే రావాలని మంకుపట్టు
  • స్వదేశీ రక్షణ పేరుతో ప్రపంచీకరణను చిదిమేస్తున్న పెద్దన్న
  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకున్నారు.
  • నోటితో పలుకరిస్తూనే.. నొసటితో వెక్కిరించే జిత్తులమారితనాన్ని చూపించారు. 

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్దన్నగా వ్యవహరిస్తున్న అగ్రరాజ్యాధినేత సంకుచిత భావాలు.. ప్రపంచీకరణనేగాక, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆశల్నీ చిదిమేస్తున్నాయి.స్వదేశీ రక్షణ పేరుతో ఆపత్కాల స్నేహ సూత్రాలను సైతం మరిచి ప్రవర్తిస్తున్న ట్రంప్‌.. పన్నులను ఎక్కుపెడుతూ అమెరికాయేతర దేశాల ప్రయోజనాలను కాలరాస్తున్నారు.

వాషింగ్టన్‌, మే 15: చైనా నుంచి భారత్‌సహా ఇతర దేశాలకు వెళ్లిపోతున్న అమెరికా సంస్థలకు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బ్రేకులు వేస్తున్నారు. కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో అమెరికాతోపాటు అనేక దేశాల సంస్థలు చైనా నుంచి బయటకు రావాలని చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికా కంపెనీలు తిరిగి స్వదేశానికే రావాలని, లేనిపక్షంలో కొత్తకొత్త పన్నులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్‌ హెచ్చరించారు. ఇది చైనా నుంచి భారత్‌కు యాపిల్‌ రాకను అడ్డుకుంటున్నది. అమెరికా టెక్నాలజీ దిగ్గజం, ఐఫోన్‌ తయారీ సంస్థ యాపిల్‌.. చైనా నుంచి భారత్‌, ఐర్లాండ్‌కు తమ ఉత్పాదక కేంద్రాలను తరలించాలని చూస్తున్న సంగతి విదితమే. అయితే ఫాక్స్‌ బిజినెస్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ మాట్లాడుతూ ‘ఇండియాకు వెళ్తామని యాపిల్‌ చెప్తున్నది. ఇదే జరిగితే ఆ సంస్థకు పన్ను పోటు తప్పదు’ అన్నారు. అమెరికాకు కాకుండా చైనా నుంచి మరే దేశానికి తమ ప్లాంట్లను తరలించినా.. వాటికి కొత్త పన్ను విధానం ఉంటుందని తేల్చిచెప్పారు. అలాగే అమెరికాకు వచ్చే సంస్థలకు పన్ను ప్రోత్సాహకాలు ఉంటాయనీ ప్రకటించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అమెరికా సంస్థలు స్వదేశీ ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని, అమెరికన్‌ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. అలాకాకుండా వేరే దేశాలకు వెళ్తామంటే ఊరుకోబోని ఆయన హెచ్చరించారు. 

భారత్‌కు ఎదురుదెబ్బ

చైనా నుంచి బయటకు వస్తున్న విదేశీ సంస్థలను ఆకట్టుకోవాలన్న భారత్‌ ఆశల్ని ట్రంప్‌ ఆదిలోనే చిదిమేస్తున్నారు. దీంతో ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు ఊతమిస్తూ మోదీ సర్కారు సిద్ధం చేస్తున్న ప్రణాళికలు అయోమయంలో పడ్డాయి. నిజానికి కరోనా వైరస్‌ దెబ్బకు చిగురుటాకులా వణికిపోతున్న అమెరికాకు భారత్‌ అండగా నిలిచింది. ఈ మహమ్మారి నియంత్రణకు వినియోగించే హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ ఔషధాన్ని సరఫరా చేసింది. అయినా ట్రంప్‌  విశ్వాసాన్ని చూపలేకపోతున్నారు. ఒడ్డుకు చేరాక తెప్ప తగలేసే దుర్నీతినే అనుసరిస్తున్నారు. తనకు నష్టం వస్తుందనిపిస్తే చైనా, భారత్‌ అన్న తేడాలుండవని, అంతా ప్రత్యర్థులేనని అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు.

చైనా కుట్రలు

తమ దేశం నుంచి భారత్‌, ఇతర సరిహద్దు దేశాలకు వెళ్తున్న సంస్థలను అడ్డుకునేందుకు చైనా కుట్రలకు తెరతీసింది. దేశ సరిహద్దుల్లో సైన్యం ద్వారా దాడులు, దురాక్రమణలకు తెగబడుతున్నది. లడఖ్‌, సిక్కిం సరిహద్దుల్లో గత మూడు వారాల నుంచి నెలకొన్న ఉద్రిక్తతలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నేపాల్‌, ఇండోనేషియా, వియత్నాం, తైవాన్‌, మలేషియా దేశాల సరిహద్దుల్లోనూ డ్రాగన్‌ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది. కరోనా నేపథ్యంలో చైనా నుంచి భారత్‌కు కనీసం వెయ్యి సంస్థలు వెళ్లిపోతున్నాయన్న అంచనాలతో చైనా ఈ కుట్రలకు పాల్పడుతున్నది. పొరుగు దేశాల్లో అలజడులు చెలరేగితే తమ దేశం నుంచి ఏ సంస్థా వెళ్లదన్న దురాలోచనతో చైనా ఈ విధంగా వ్యవహరిస్తున్నది.


logo