Stock Market | ముంబై, నవంబర్ 18 : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలు.. లక్షల కోట్ల రూపాయల్లో మదుపరుల సంపదను హరించాయి. గత 35 రోజుల్లో (ట్రేడింగ్ సెషన్లలో) ఏకంగా రూ.50 లక్షల కోట్లకుపైగా మార్కెట్ విలువ పడిపోయింది మరి. ఈ ఏడాది సెప్టెంబర్ 27న బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ. 478.93 లక్షల కోట్లుగా ఉంటే.. ఈ నెల (నవంబర్) 18న అది రూ.428.67 లక్షల కోట్ల కు క్షీణించింది. దీంతో రూ.50.26 లక్షల కో ట్లు ఆవిరైనైట్టెంది. బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 8,639.24 పాయింట్లు దిగజారింది. సెప్టెంబర్ 27న సెన్సెక్స్ ఆల్‌టైమ్ హై 85,978.25 పాయింట్ల వద్ద ఉన్నది.
భారతీయ మార్కెట్లకు విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) దూరం జరుగుతున్నారు. స్టాక్ మార్కెట్లు ట్రేడైన గత 35 రోజుల్లో రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇక ఎఫ్ఐఐలుసహా విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపరులు (ఎఫ్‌పీఐలు) గత నెల ఒక్క అక్టోబర్‌లో తరలించుకుపోయిన పెట్టుబడుల విలువే రూ.1,13,858 కోట్లుగా ఉన్నది. ఈ నెల మొదలు ఇప్పటిదాకా దాదాపు మరో రూ.23వేల కోట్లను తిరిగి లాగేసుకున్నట్టు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) గణాంకాలు చెప్తున్నాయి. చైనా, జపాన్ మార్కెట్లు ఆకర్షణీయంగా కనిపిస్తుండటం, దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరాశాజనకంగా నమోదవుతున్న కార్పొరేట్ సంస్థల త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల కోతలు వంటివి భారత్‌కు ఎఫ్‌పీఐలను దూరం చేస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ కనిష్ఠాలకు పడిపోతుండటం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో డాలర్ ఇండెక్స్ పెద్ద ఎత్తున బలపడిన విషయం తెలిసిందే. ఈ పరిణామం రూపాయిపై సహజంగానే ప్రభావం చూపుతున్నది.
సెన్సెక్స్, నిఫ్టీలు మళ్లీ నష్టాలకే పరిమితమయ్యాయి. సోమవారం ఉదయం ఆరంభం నుంచే సెల్లింగ్ ప్రెషర్ కనిపించగా.. ఐటీ, చమురు షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 241.30 పాయింట్లు లేదా 0.31 శాతం క్షీణించి 77,339.01 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 615.25 పాయింట్లు కోల్పోవడం గమనార్హం. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా 78.90 పాయింట్లు లేదా 0.34 శాతం దిగజారి 23,453.80 వద్ద ముగిసింది. నిఫ్టీకి వరుసగా ఇది ఏడోరోజు నష్టం.
విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ
అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయం
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం
పేలవమైన త్రైమాసిక ఆర్థిక ఫలితాలు
విజృంభించిన ద్రవ్యోల్బణం
లాభాల స్వీకరణ దిశగా మదుపరులు