Congress- Gold Import Duty | బంగారంపై భారీగా కస్టమ్స్ సుంకం తగ్గించడంలో లాజిక్ ఏమిటో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్న తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బంగారంపై దిగుమతి సుంకం తగ్గించిన నేపథ్యంలో బంగారం దిగుమతులు పెరుగుతాయా? అన్న కోణంలో నిఘా పెట్టాలని కోటక్ మహీంద్రా ఏఎంసీ ఎండీ కం సీఈఓ నీలేష్ షా వ్యాఖ్యానించారు. నీలేష్ షా వ్యాఖ్యలను ఉటంకిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ వేదికగా ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. బంగారం దిగుమతులపై నీలేష్ షా వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
‘నీలేష్ షాకు ఫైనాన్సియల్ వరల్డ్ లో ఎంతో గౌరవం ఉంది. అంతే కాదు ఆయన ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులు కూడా. ఇతరులు చాలా అంశాలపై మాట్లాడతారు. కానీ నీలేష్ షా ఆర్థిక అంశాలను ప్రస్తావించడానికి మాత్రమే పరిమితం అయ్యారు’ అని జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. 2022-23తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు 30 శాతం పెరిగి 45.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. చాలా తక్కువ ఆర్థిక వృద్ధిరేటు మాత్రమే నమోదైన తరుణంలో బంగారం దిగుమతులు పెరగడం చర్చానీయాంశంగా మారిందని జైరామ్ రమేశ్ వ్యాఖ్యానించారు.
‘కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశ పెడుతూ బంగారంపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి ఆరు శాతానికి తగ్గించేశారు. వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సెస్ తో కలుపుకుంటే జీఎస్టీతో కలుపుకుని బంగారంపై 18.5 శాతం పన్ను విధిస్తారు. కానీ తాజా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో బంగారంపై పన్నులు తొమ్మిది శాతానికి దిగి వచ్చాయి. దీని వెనుక లాజిక్ ఏమిటి’ అని జైరామ్ రమేశ్ ప్రశ్నించారు.