Subsidy | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): సబ్సిడీలకు రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడబోతున్నదా..ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. కొంత సొంత పెట్టుబడి, మరికొంత బ్యాంకు వద్ద రుణం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలతో కొత్తగా పరిశ్రమలను ఏర్పాటు చేయాలని చూస్తున్న వారికి రాష్ట్ర సర్కార్ గట్టి షాకిచ్చింది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేకుండా పరిశ్రమ పెట్టేవారు చాలా అరుదు. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారీ పెట్టుబడులు వస్తున్నాయని, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయని గొప్పలు చెబుతున్న రేవంత్ సర్కార్ ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నంగా తయారైంది. ప్రోత్సాహకాలు అందించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. చిన్న స్థాయి సంస్థల నుంచి మధ్య స్థాయి కంపెనీల వరకు సబ్సిడీల రూపంలో చెల్లించాల్సిన రూ.3,500 కోట్లు పెండింగ్‌లో ఉండటం చూస్తుంటే వీరికి మొండిచెయ్యి చూపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గడిచిన ఏడాదిగా వీరికి సబ్సిడీలు అప్పుడు..ఇప్పుడు అంటు కాలం వెళ్లదీస్తున్నాయి తప్పా ముందుకు సాగడం లేదు.
ప్రభుత్వ ప్రకటనలు, లక్ష్యాలు చూస్తుంటే ఉట్టికి ఎదరలేనమ్మ ఆకాశానికి ఎగిరినట్టుంది అనే సామెత గుర్తుకురాక మానదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26) ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రభుత్వం పరిశ్రమలు, వాణిజ్యశాఖకు రూ. 3,898 కోట్లు కేటాయించింది. ఇందులో భారీ పరిశ్రమల ప్రోత్సాహకాలకు రూ.1,730 కోట్లు, గ్రామీణ, చిన్నతరహా పరిశ్రమలకు రూ.1,049 కోట్లు, క్యాపిటల్ వర్క్స్‌కు రూ.371 కోట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు రూ.137 కోట్లు ఖర్చుచేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, వచ్చే ఐదేళ్లలో రూ. 4 వేల కోట్లతో 25వేలకు పైచిలుకు కొత్త ఎంఎస్ఎంఈ పరిశ్రమలను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇవికాకుండా రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో గ్రీన్‌ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ల ఏర్పాటు చేసి అక్కడ యాంటీ బయోటిక్స్, సింథటిక్ డ్రగ్స్, వ్యాక్సిన్లు, న్యూట్రా స్యూటికల్స్, హెర్బల్ ఔషధ ఉత్పత్తులు, కాస్మోటిక్స్ తదితర వాటికి ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పారిశ్రామిక వికేంద్రీకరణే లక్ష్యంగా మెగా మాస్టర్‌ప్లాన్- 2050ని రూపొందించి.. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతా ల్లో ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్, ఫుడ్ ప్రాసెసింగ్, స్పోర్ట్స్, ఆటోమొబైల్, గార్మెంట్స్, చేనేత, ఆభరణాలు తదితర క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే, హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్ ఎన్‌హెచ్-163కి ఇరువైపులా పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ ప్రణాళికలు బాగానే ఉన్నప్పటికీ ముందు చిన్నచిన్న యూనిట్లు పెట్టుకున్నవారికి ఇవ్వాల్సిన సబ్సిలు విడుదలచేస్తే బావుంటుందని పరిశ్రమవర్గాలు కోరుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లో నూతన ఎంఎస్ఎంఈ పాలసీని ప్రవేశపెట్టిన విషయం విధితమే. ఏడు నెలలు దాటినా ఇంతవరకు దీనికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో చిన్న చితక యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొచ్చిన యువతకు సబ్సిడీలు రావడంలేదనే చేదువార్త తెలుసుకొని వారు వెనక్కి తగ్గుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు దొరక్క ఏదో ఒక పరిశ్రమ ఏర్పాటు చేసుకొని సొంతకాళ్లపై నిలబడాలనుకునేవారు ప్రభుత్వ వైఖరితో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దాదాపు 20 వేలకిపైగా ఎంఎస్ఎంఈల వ్యవస్థాపకులకు రూ. 3,500 కోట్లవరకూ సబ్సిడీలు రావాల్సివుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి సుమారు రూ.1,650 కోట్లు కాగా, జనరల్ కేటగిరీలోనివారికి దాదాపు రూ.1,850 కోట్ల వరకు సబ్సిడీలు పెండింగులో ఉన్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. భారీగా పెట్టుబడులు రాబడుతున్నట్లు సర్కారు గొప్పలు చెబుతున్నప్పటికీ ఏ ఒక్కటీ క్షేత్రస్థాయిలో కానరావడంలేదు. దీనికితోడు చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేవారికి కూడా ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో పారిశ్రామికరంగం పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మరోవైపు, సబ్సిడీల కోసం ఎంపికైన వారితో పరిశ్రమల శాఖ కార్యాలయం నిత్యం కిటకిటలాడుతున్నది. ప్రభుత్వం సబ్సిడీ మంజూరు చేయబట్టే తాము బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నట్లు, ఇప్పుడు సబ్సిడీలు రాక, బ్యాంకులకు వడ్డీలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు వాపోతున్నారు. కాగా, అధికారులు మాత్రం తాము ఏమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. ఏదైనా ఉంటే ప్రభుత్వంతోనే మాట్లాడుకోవాలని, ఆఫీసులో తమ పనులకు అంతరాయం కలిగించవద్దని వారు చిరాకుపడుతున్నారు.