హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్లో ఆర్థికపరమైన నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీపై త్వరలో ఒక చట్టం తీసుకొస్తామని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. రాయదుర్గంలో శుక్రవారం కొటెల్లిజెంట్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం, ప్రపంచ వ్యాప్తంగా డిజిటలైజేషన్ పెరుగుతున్నదని, దీంతో సైబర్ నేరాలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పారు. డాటా పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ప్రధానమంత్రి ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాకింగ్‌కు గురయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో భౌతిక యుద్ధాలు ఉండవని, సైబర్ యుద్ధాలే జరుగుతాయని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి సహా అనేకమంది చెప్పారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే సైబర్ సెక్యూరిటీపై ప్రత్యేక చట్టం తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. కొటెల్లిజెంట్ సంస్థ ఏర్పాటుచేసిన సైబర్ వారియర్స్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ద్వారా పెద్ద సంఖ్యలో శిక్షణ ఇప్పిస్తామని అన్నారు.
ఉద్యోగాలిచ్చే కంపెనీలకు ప్రోత్సాహకాలు
ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కావని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశ జనాభాలో 35 సంవత్సరాల వయస్సు ఉన్న యువత 65 శాతం ఉన్నారని, వీరిలో చాలామంది ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్నారని చెప్పారు. వారికి ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు 1-2 శాతమే ఉంటాయని, అందువల్ల అందరికీ ప్రభుత్వోద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రైవేటురంగంలో పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమలు స్థాపించే విధంగా చూడటం సరైన విధానమని చెప్పారు. ఈ దిశలోనే తమ ప్రభుత్వం టీఎస్ఐపాస్ విధానాన్ని తీసుకొచ్చిందని అన్నారు. స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు వివిధ రకాల ప్రోత్సాహకాలను అందిస్తున్నామని తెలిపారు. కొటెల్లిజెంట్ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీసాయికిరణ్ గోవిందరావుపేట లాంటి మారుమూల ప్రాంతంలో జన్మించి అమెరికాకు వెళ్లి తిరిగొచ్చి మరో పది మందికి ఉద్యోగాలు ఇప్పించాలనే కంపెనీని ఏర్పాటు చేశారన్నారు.