హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ‘హైదరాబాద్‌లో గూగుల్ ఆఫీస్ రెండు ఎకరాల్లో మాత్రమే ఉంది. మా ఇందిరా మహిళా శక్తి సెంటర్ మూడున్నర ఎకరాల్లో ఉంది. మా మహిళలతోనే గూగుల్‌కు పోటీ’.. ఇవీ బుధవారం హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్(జీఎస్ఈసీ)ను ప్రారంభించిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు.
తెలంగాణ మహిళలు ధనిక పెట్టుబడిదారులకు పోటీదారులుగా మారుతున్నారని చెప్పారు. గూగుల్ ఇన్నోవేటివ్ సంస్థ అని, తమది ఇన్నోవేటివ్ ప్రభుత్వమని తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు కోసం సిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అనంతరం ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్ అంటే ఒక నగరం కాదని.. ఒక భవిష్యత్తు అని అభివర్ణించారు. అంతర్జాతీయ టాప్ 10 టెక్ దిగ్గజాల్లో ఏడు హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, ఇతర దిగ్గజ సంస్థలు తెలంగాణతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.