హైదరాబాద్, ఏప్రిల్ 22( నమస్తే తెలంగాణ ) : వారం రోజులపాటు సాగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం జపాన్ పర్యటన మంగళవారంతో ముగిసింది. బృందం బుధవారం రాష్ర్టానికి చేరుకోనున్నది. జపాన్ పర్యటన సందర్భంగా రూ. 12,062కోట్ల పెట్టుబడులు సాధించినట్లు, తద్వారా సుమారు 30,500 ఉద్యోగాలు లభించనున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ప్రభుత్వం ప్రకటిస్తున్నది ఒకవైపు ఇలా ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న కంపెనీల సామర్ధ్యం, వాటి విశ్వసనీయతలపై అనేక సందేహాలున్నాయి. మరోవైపు, ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర బృందం హిరోషిమా ప్రిఫెక్చర్ అసెంబ్లీని సందర్శించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…హిరోషియా-హైదరాబాద్, జపాన్-తెలంగాణల మధ్య బలమైన సంబంధాలు నిర్మిద్దామని పిలుపునిచ్చారు.