Closing Bell : ఒకరోజు విరామానికి తెరదించుతూ దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) శుక్రవారం మళ్లీ లాభాల బాటపట్టాయి. పశ్చిమాసియా (West Asia) లో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తున్నప్పటికీ.. దేశీయంగా కొనుగోళ్ల మద్దతు కొనసాగడంతో సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ (Sensex) 918.6 పాయింట్లు పెరిగి 77,550.25 వద్ద స్థిరపడింది. నిఫ్టీ (Nifty) కూడా 275.5 పాయింట్లు లాభపడి 24,050.6 వద్ద ముగిసింది.
ట్రేడింగ్‌లో ఒక దశలో సెన్సెక్స్ 77,622.50, నిఫ్టీ 24,074.05 వద్ద ఇంట్రాడే గరిష్ఠాలను తాకాయి. ఏషియన్ పెయింట్స్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి హెవీ వెయిట్ షేర్లు లాభపడటం సూచీల పెరుగుదలకు దోహదపడింది. బెంచ్‌మార్క్ సూచీలను మించి బ్రాడర్ మార్కెట్లు రాణించడం గమనార్హం. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.48 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.67 శాతం చొప్పున లాభపడ్డాయి.
రంగాల వారీగా చూస్తే మిశ్రమ ప్రదర్శన కనబరిచాయి. ఐటీ షేర్లలో కొనుగోళ్ల ఆసక్తి పెరగడంతో నిఫ్టీ ఐటీ సూచీ టాప్ గెయినర్‌గా నిలిచింది. మరోవైపు నిఫ్టీ ఆటో, బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు మిగిలిన వాటితో పోలిస్తే వెనుకబడ్డాయి. ఉదయం సెషన్ ప్రారంభంలో కూడా ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలతో సూచీలు లాభాలతోనే మొదలయ్యాయి.