కోల్సిటీ, డిసెంబర్ 19 : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గణేశ్చౌక్లో ఆపరేషన్ చౌరస్తా ఉద్రిక్తతకు దారి తీసింది. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని టాక్సీ స్టాండ్ పక్కన గల ప్రభుత్వ స్థలంలో ఉన్న దుకాణాలను రామగుండం టౌన్ ప్లానింగ్ అధికారులు శుక్రవారం తొలగించేందుకు ఎక్స్కవేటర్తో రాగా వ్యాపారులు అడ్డుకున్నారు. కూల్చివేస్తే తమ జీవనోపాధి ఎలా? అంటూ వాపోయారు. ఇది ప్రభుత్వ స్థలమని, ఇందులో నిర్మించుకున్న దుకాణాలు తొలగించుకోవాలని గతంలోనే నోటీసులు జారీ చేశామని, ఖాళీ చేయని కారణంగా తామే తొలగించాల్సి వస్తున్నదని అధికారులు స్పష్టం చేశారు.
తమకు ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చివేస్తే రేపటి నుంచి తమ కుటుంబాలు వీధిన పడుతాయని, తమ పొట్ట కొట్టవద్దంటూ బాధితులు కన్నీరు పెట్టుకున్నారు. పలువురు రాజకీయ నాయకులు ఘటనాస్థలానికి చేరుకొని బాధితులకు మద్దతుగా నిలిచి, కూల్చివేతలను ఆపాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చట్టరీత్యా నేరమని, ఎప్పటికైనా ఖాళీ చేయాల్సిందేనని అధికారులు సముదాయించడంతో బాధితులు షాపుల్లోని సామగ్రిని బయటకు తీసుకొచ్చి ఖాళీ చేశారు. అనంతరం పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగాయి.