Citroen Basalt |ప్రముఖ ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ (Citroen) అనుబంధ సిట్రోన్ ఇండియా (Citroen India) దేశీయ మార్కెట్లో మిడ్ సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్ పై పట్టు సాధించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సెగ్మెంట్ లో విక్రయిస్తున్న సీ3 ఎయిర్ క్రాస్ (C3 Aircross) మోడల్ కారుకు తోడుగా కూపే ఎస్యూవీ సిట్రోన్ బసాల్ట్ (Citroen Basalt) కారును ఆగస్టు రెండో తేదీన ఆవిష్కరించనున్నది. త్వరలో మార్కెట్లోకి రానున్న టాటా మోటార్స్ (Tata Motors) టాటా కర్వ్ (Tata Curvv) కారుకు పోటీగా సిట్రోన్ బసాల్ట్ (Citroen Basalt) వస్తోంది. సామాన్యులకు సైతం ప్రీమియం బాడీ స్టైల్లో బసాల్ట్ కారును తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం సిట్రోన్ బసాల్ట్ కారును ప్రదర్శించింది.
భారత్ మార్కెట్లోకి వస్తున్న అత్యంత చౌక ఎస్యూవీ కారు సిట్రోన్ బసాల్ట్ కానున్నది. ఇప్పటికే సిట్రోన్ డీలర్ షిప్స్.. బసాల్ట్ బుకింగ్స్ ప్రారంభించాయి. ఫ్రంట్ లో చంకీ బంపర్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్ తోపాటు నూతన సెట్ టెయిల్ ల్యాంప్స్, న్యూ సెట్ ఆఫ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఇంటీరియర్గా వైబ్రంట్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, ఫ్రంట్ అండ్ రేర్ ఆర్మ్ రెస్ట్స్ కంప్లీట్ విత్ కప్ హోల్డర్స్, టైప్ సీ చార్జింగ్ పోర్టులు, వైర్ లెస్ చార్జింగ్ క్యాపబిలిటీస్, క్రూయిజ్ కంట్రోల్, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ తదితర ఫీచర్లు ఉంటాయి. ఈ కారు 1.2 లీటర్ల త్రీ సిలిండర్, టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 109 బీహెచ్పీ విద్యుత్, 205 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ ఆప్షన్లలో లభిస్తాయి.