హైదరాబాద్, ఏప్రిల్ 15: గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు(జీసీసీ) ఆకట్టుకోవడంలో హైదరాబాద్ దూసుకుపోతున్నది. ఇప్పటికే ఇక్కడ అంతర్జాతీయ సంస్థలు జీసీసీలను నెలకొల్పగా..తాజాగా ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కూడా ఈ జాబితాలోకి చేరింది. అమెరికాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ సిటిజెన్స్ ఫైనాన్షియల్ సంస్థతో కలిసి ఏర్పాట చేసిన జీసీసీని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…గ్లోబల్ బిజినెస్ హబ్‌గా మారిన హైదరాబాద్‌లో 2030 నాటికి 200 మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్-ఏ కమర్షియల్ ఆఫీస్ స్థలాలను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.
రాష్ట్రంలో ఆఫీస్ స్థలాలకు గిరాకీ భారీగా పెరుగుతున్నదని, గతేడాది రిటైల్ రంగంలో 1.8 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని పలు రిటైల్ సంస్థలు అద్దెకు తీసుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతం నగరంలో అమెజాన్, గ్లోబల్ లాజిక్‌తోపాటు పలు అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ 355 జీసీసీలను ఏర్పాటు చేయగా, తద్వారా 3 లక్షల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించాయన్నారు. గడిచిన ఏడాది వ్యవధిలోనే 70కి పైగా జీసీసీ ప్రారంభంకావడం విశేషమన్నారు. ఇక్కడ తమ జీసీసీని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన సిటిజెన్స్ ఫైనాన్షియల్ గ్రూప్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం వెయ్యి మంది ఐటీ, డాటా నిపుణులకు ఇకడ ఉపాధి అవకాశాలు లభిస్తాయని…వచ్చే రెండు, మూడేళ్లలో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందన్నారు.