ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో.. ఆ ఇంటికి ఈ ఇల్లూ అంతే అన్నట్టు అమెరికాతో ప్రపంచ దేశాలు నడుచుకుంటున్నాయి.
అగ్రరాజ్యం అధ్యక్షుడు ప్రతీకార సుంకాలు ప్రకటించిన గంటల వ్యవధిలోనే చైనా గట్టిగా బదులిచ్చింది. ట్రంప్‌కు రిటర్న్ గిఫ్ట్‌ను సిద్ధం చేసి ట్రేడ్ వార్‌కు సై అన్నది.
తమపై విధించిన 34 శాతం అదనపు సుంకాలకు తగ్గట్టుగానే అమెరికా దిగుమతులపై సుంకాలు వేస్తామని స్పష్టం చేసింది. ఈ నెల 10 నుంచే మొదలు.
Tariff War | బీజింగ్, ఏప్రిల్ 4: ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టుగా అమెరికా ప్రతీకార సుంకాలపై ఆయా దేశాలు దీటుగా స్పందిస్తున్నాయి. ఈ ధిక్కార పోరు ఊహించినట్టుగానే చైనాతోనే మొదలైంది. డ్రాగన్‌తో మొదట్నుంచీ పొసగని ట్రంప్.. బుధవారం పెద్ద ఎత్తునే టారిఫ్‌లను విధించారు. అమెరికాలోకి వచ్చే చైనా వస్తూత్పత్తులపై 34 శాతం సుంకాలు ఉంటాయని తేల్చిచెప్పారు. ఇప్పుడు వర్తిస్తున్న సుంకాలపై ఇవి అదనం. దీనికి చైనా కూడా శుక్రవారం అదే స్థాయిలో జవాబిచ్చింది. ఈ నెల 10 నుంచి మా దేశంలోకి దిగుమతి అయ్యే అన్ని అమెరికా వస్తూత్పత్తులపై మరో 34 శాతం సుంకాలు పెరుగుతాయని జిన్‌పిన్ సర్కారు స్పష్టం చేసింది. ఈ మేరకు అక్కడి ప్రభుత్వ రంగ జిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
ప్రపంచంలోని రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ రాజుకుంటున్నది. అమెరికా అధ్యక్షుడిగా తొలిసారి ఎన్నికైనప్పుడే ట్రంప్.. చైనాతో ఢీ అంటే ఢీ అన్న సంగతి విదితమే. అయితే అగ్రరాజ్యాధినేతగా బైడెన్ వచ్చాక ఈ ఉద్రిక్తతలు క్రమేణా తగ్గుముఖం పట్టాయి. కానీ ఇప్పుడు ట్రంప్ రావడంతో మళ్లీ కథ మొదటికే వచ్చినైట్టెంది. అమెరికాకు ఎగుమతి అవుతున్న చైనా వస్తూత్పత్తులపై సుంకాల భారం ఒక్కసారిగా 54 శాతానికి చేరింది మరి. కాగా, అమెరికా విధించిన టారిఫ్‌ల ప్రభావం శనివారం నుంచే ప్రపంచ దేశాలపై మొదలుకానున్నది. తొలుత కనీస టారిఫ్ 10 శాతం, మిగతాది 9వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.
ఆయా దేశాలపై అమెరికా ప్రకటించిన ప్రతీకార సుంకాల్లో భారత్‌పై పడ్డది 27 శాతం కాదని 26 శాతమేనని తాజా వైట్ హౌజ్ డాక్యుమెంట్ పేర్కొన్నది. అమెరికా వస్తూత్పత్తులపై భారత్‌లో 52 శాతం సుంకాలు పడుతున్నాయని, దాని ప్రకారం 26 శాతం భారత్‌పై విధిస్తున్నట్టు స్పష్టం చేసింది. అంతకుముందు ఇవే డాక్యుమెంట్లలో 27 శాతంగా చూపారు.
భారతీయ మార్కెట్లో ఎల్ఐసీకి కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభిస్తున్నదని, అందుకే ఇక్కడ విదేశీ బీమా సంస్థలు మనుగడ సాగించలేకపోతున్నాయని అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) ఓ నివేదికలో పేర్కొనడాన్ని ఎల్ఐసీ ఖండించింది. 25 ఏండ్లుగా ఎప్పుడూ ప్రభుత్వాల నుంచి ఆ రకమైన ప్రోత్సాహం పొందలేదన్నది.