Trump Tariffs | వాషింగ్టన్/బీజింగ్, ఏప్రిల్ 16: అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. పరస్పరం ప్రతీకార సుంకాలతో ఇరు దేశాలు తగ్గేదేలే అంటున్నాయి. తాజాగా చైనా నుంచి అమెరికాలోకి దిగుమతయ్యే వస్తూత్పత్తులపై మరో 100 శాతం అదనపు సుంకాలు వచ్చిపడ్డాయి. ఈ మేరకు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక ఆదేశాలు జారీ చేసినట్టు వైట్‌హౌజ్ వర్గాలు బుధవారం ప్రకటించాయి. దీంతో చైనాపై సుంకాల భారం 245 శాతానికి చేరినైట్టెంది. మంగళవారం రాత్రే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోగా.. అమెరికాకు చెందిన బోయింగ్ విమానాలను చైనాకు చెందిన ఏ విమానయాన సంస్థ తీసుకోవద్దని జిన్‌పిన్ సర్కారు హుకుం జారీ చేసిన నేపథ్యంలోనే ఈ సుంకాల పెంపు చోటుచేసుకున్నది.
ఆయా దేశాల సుంకాలతో దిగాలుపడిన అమెరికా ఆర్థిక వ్యవస్థకు పూర్వ వైభవం తేవడమే లక్ష్యంగా.. ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ఈ ప్రతీకార సుంకాలకు రెండు వారాల క్రితం తెరతీసిన విషయం తెలిసిందే. అయితే ఇంటా-బయట ఆందోళనలు చెలరేగడం, మదుపరుల భయాలతో స్టాక్-బాండ్ మార్కెట్లు భీకర నష్టాల్లోకి జారుకోవడంతో వెనక్కితగ్గిన ట్రంప్ సర్కారు.. 90 రోజులపాటు సుంకాల అమలును వాయిదా వేసింది. కానీ చైనాకు మాత్రం ఈ ఊరట దక్కలేదు. అమెరికా సుంకాలకు దీటుగా స్పందించడమే కారణం. ఇక భారత్‌సహా అనేక దేశాలు అమెరికాతో వాణిజ్య ఒప్పందాలకు ప్రయత్నిస్తుండగా, బంతి చైనా కోర్టులోనే ఉందని, ట్రేడ్ వార్‌కు ముగింపు పలకాలో.. వద్దో ఆ దేశమే తేల్చుకోవాలని ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదని చైనా తెగేసి చెప్తున్నది. ఇప్పటికే చైనాలోకి వచ్చే అమెరికా వస్తూత్పత్తులపై 125 శాతం సుంకాలను అమల్లోకి తెచ్చిన జిన్‌పిన్ సర్కారు.. ఎలక్ట్రానిక్, రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి అవసరమైన ప్రధాన ఖనిజాల ఎగుమతులకు బ్రేక్ వేసిన సంగతి విదితమే.
అమెరికాతో ట్రేడ్ వార్ తారస్థాయికి చేరిన నేపథ్యంలో ప్రపంచ దేశాల మద్దతు కోసం చైనా గట్టిగానే ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలోనే కొత్త అంతర్జాతీయ వాణిజ్య దూతను జిన్‌పిన్ సర్కారు నియమించింది. లీ చెంగాంగ్‌ను తమ నూతన ఇంటర్నేషనల్ ట్రేడ్ రిప్రజెంటేటివ్‌గా బుధవారం చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే సుంకాల ప్రతిష్ఠంభనకు తెర దించేందుకు ట్రంప్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇది మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. పైగా 2020లో అప్పటి ట్రంప్ సర్కారుతో ఏర్పడ్డ ప్రతీకార సుంకాల పోరుకు స్వస్తి చెప్పేందుకు చైనా జరిపిన చర్చల్లో లీ పాల్గొనడం గమనార్హం. గతంలో ఈయన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో చైనాకు అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు.
ఇక ఇప్పటికే అమెరికా సుంకాలపై చైనా డబ్ల్యూటీవోలోనూ పోరాడుతున్నది తెలిసిందే. అలాగే అధిక సుంకాలను ఎదుర్కొంటున్న యూరోపియన్ యూనియన్ (ఈయూ) తదితర దేశాల మద్దతు కోసమూ త్రీవంగానే ప్రయత్నిస్తున్నది. ఇదిలావుంటే ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో చైనా జీడీపీ అంచనాలను మించి 5.4 శాతంగా నమోదైంది. టారిఫ్ వార్ నడుమ గ్లోబల్ మార్కెట్లో ఆ దేశ ఎకానమీపై ఏర్పడ్డ భయాలను ఈ గణాంకాలు తొలగించేస్తుండటం విశేషం.