CERT-In | గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ ఐ-ఫోన్లు, మ్యాక్స్, ఆపిల్ వాచీలు వాడుతున్న వారిని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వశాఖ అనుబంధ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సెర్ట్-ఇన్) అలర్ట్ చేసింది. ఔట్ డేటెడ్ సాఫ్ట్ వేర్ వాడుతున్న వస్తువుల్లో సెక్యూరిటీ లోపాలున్నాయని గుర్తించింది. పాత వర్షన్ ఓఎస్ వాడకం వల్ల సైబర్ మోసగాళ్లు ఫోన్లలోకి చొరబడి మీ వ్యక్తిగత సున్నిత సమాచారాన్ని తస్కరించే ముప్పు ఉందని పేర్కొంది. 17.7.1 వర్షన్ ఐ-ఫోన్లు, ఐపాడ్లు, మ్యాక్స్, వాచ్ ఓఎస్11 వర్షన్ సాఫ్ట్ వేర్ గల ఆపిల్ వాచీలకు సైబర్ మోసగాళ్ల నుంచి ముప్పు పొంచి ఉందని సెర్ట్-ఇన్ హెచ్చరించింది. వీటితోపాటు పాత వర్షన్ గల టీవీఓఎస్, విజన్ ఓఎస్, సఫారీ బ్రౌజర్ మీద ప్రభావం పడుతుందని తెలిపింది.
కనుక ఐ-ఫోన్ల యూజర్లు ఐఓఎస్ 18.1 వర్షన్, ఐపాడ్ యూజర్లు 18.1 ఐపాడ్ ఓఎస్, ఆపిల్ వాచీల వాడకం దారులు వాచ్ ఓఎస్ 11 వర్షన్ అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే సాఫ్ట్ వేర్ లోపాలు గుర్తించిన ఆపిల్.. కొత్త సెక్యూరిటీ అప్ డేట్స్‌తో పరిష్కారం చూపిందని తెలిపింది. ఇప్పటికీ పాత సాఫ్ట్ వేర్ వర్షన్ వాడుతున్న ఆపిల్ డివైజ్‌ల యూజర్లు వాటిల్లోని సాఫ్ట్వేర్ అప్ డేట్ చేసుకోవాలని హితవు చెప్పింది. అలా చేసుకుంటేనే సైబర్ మోసగాళ్ల ముప్పు నుంచి తప్పించుకోగలరని సెర్ట్-ఇన్ స్పష్టం చేసింది.