పేరు : సంజయ్ మల్హోత్రా
వయసు : 56 ఏండ్లు
చదువు : ఐఏఎస్ (1990 బ్యాచ్ రాజస్థాన్ కేడర్)
అనుభవం : 33 ఏండ్లు
ప్రస్తుత హోదా : కేంద్ర రెవెన్యూ కార్యదర్శి
న్యూఢిల్లీ, డిసెంబర్ 9: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి, రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాను సోమవారం కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆర్బీఐకి ఈయన 26వ గవర్నర్ కానున్నారు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం మంగళవారం (డిసెంబర్ 10)తో ముగుస్తున్నది. ఈ క్రమంలోనే ఆయన స్థానంలోకి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ మల్హోత్రాను మోదీ సర్కారు తీసుకొచ్చింది.
ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ లైన్‌క్లియర్ చేసింది. బుధవారం (డిసెంబర్ 11) నుంచి మూడేండ్లపాటు ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతల్ని నిర్వర్తించనున్నారు. ఐఐటీ కాన్పూర్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్‌ను పూర్తిచేసిన సంజయ్ మల్హోత్రా.. అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీని సైతం పొందారు.
33 ఏండ్ల తన కెరియర్లో ఎన్నో ప్రభుత్వ రంగ శాఖల్లో మరెన్నో బాధ్యతల్ని మల్హోత్రా నిర్వహించారు. రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. విద్యుత్తు, ఆర్థిక, పన్నులు, ఐటీ, గనులు తదితర రంగాల్లో సమర్థవంతంగా పనిచేశారు. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా పనిచేస్తుండగా, అంతకుముందు ఆర్థిక సేవల కార్యదర్శిగా ఉన్నారు. ముఖ్యంగా ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు సంబంధించిన నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరించారు.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. రిజర్వ్ బ్యాంక్ 25వ గవర్నర్‌గా 6 ఏండ్లు పనిచేసిన ఆయన.. అప్పటి గవర్నర్ ఊర్జిత్ పటేల్ అనూహ్య రాజీనామాతో 2018 డిసెంబర్ 12న ఈ పదవిలోకి వచ్చారు. 1980 తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి అయిన దాస్.. కేంద్ర ఆర్థిక శాఖలోని వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ క్రమంలోనే 8 కేంద్ర బడ్జెట్లలో భాగస్వాములయ్యారు. ఇక అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్లో రెండుసార్లు టాప్ సెంట్రల్ బ్యాంకర్‌గా దాస్ అగ్రస్థానాల్లో నిలవడం విశేషం.
గవర్నర్‌గా ఊర్జిత్ పటేల్ వైఖరితో ఆర్బీఐ-కేంద్రం మధ్య దూరం పెరిగిన వేళ దాస్‌ను మోదీ సర్కారు తీసుకొచ్చింది. నిజానికి అప్పటికే దాస్ రిటైరైపోయారు. ఈ క్రమంలో తనపై కేంద్ర పెద్దలు పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికప్పుడు నిలబెట్టుకుంటూపోయిన దాస్.. ఆర్బీఐ మిగులు నగదు నిల్వలను కేంద్ర ఖజానాకు తరలించడం మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకున్నది. అంతేగాక ఏటా కేంద్రానికి భారీగా డివిడెండ్లనూ అందించారు. గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఏకంగా మునుపెన్నడూలేనివిధంగా రూ. 2.11 లక్షల కోట్ల డివిడెండ్‌ను అప్పజెప్పారు.
నిజానికి వీటిని వ్యతిరేకించే నాడు ఆర్బీఐ గవర్నర్ పదవికి పటేల్ రాజీనామా చేయడం గమనార్హం. ఇక కరోనా సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను బలపర్చేందుకు వడ్డీరేట్లను బాగా తగ్గించడం, ఆ తర్వాత విజృంభించిన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అంతే స్థాయిలో పెంచడం, వృద్ధి-ధరల మధ్య సమన్వయం కోసం సుదీర్ఘకాలం వడ్డీరేట్లను గరిష్ఠ స్థాయిల్లోనే ఉంచడం దాస్‌కే చెల్లింది. 2016లో పాత పెద్ద నోట్ల రద్దు అంశంలోనూ నాటి ఆర్బీఐ గవర్నర్ పటేల్ కంటే దాసే కీలకపాత్ర పోషించడం విశేషం.