హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌యూ)ను ప్రైవేటీకరించే అంశంలో మోదీ సర్కారు దూకుడు పెంచినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కేంద్రం తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు సమాచారం. ఇందులోభాగంగానే తాయిలాలనూ ఎరగా వేస్తున్నట్టు చెప్తున్నారు. గతంలో కేంద్రం ఎంత ప్రయత్నించినా అప్పటి కేసీఆర్ సర్కారు ససేమిరా అంటూ వచ్చింది. దీంతో వెనక్కి తగ్గిన కేంద్రం.. ఇప్పుడు మళ్లీ స్పీడ్ పెంచింది.
నష్టాల పేరుతో సీపీఎస్యూలను వరుసగా ప్రైవేటీకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికే దేశవ్యాప్తంగా 35 సంస్థలను ప్రైవేట్‌పరం చేసింది. ఇందుకోసం 2015లోనే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధీనంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) విభాగాన్ని ఏర్పాటు చేసింది. సీపీఎస్యూలన్నింటినీ క్రమంగా ప్రైవేటీకరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండానే ఏకపక్షంగా మోదీ సర్కారు దీన్ని తేవడం గమనార్హం. 2015-16 నుంచి 2022-23 మధ్య సీపీఎస్‌యూల ప్రైవేటీకరణ ద్వారా రూ.3.75 లక్షల కోట్ల నిధులను సమీకరించింది. ఈ క్రమంలోనే తెలంగాణలో 6 సీఎస్పీయూలను ప్రైవేటీకరించాలని నిర్ణయించారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుతో కేంద్రం ప్రైవేటీకరణ అంశంపై సంప్రదింపులు జరుపుతున్నట్టు పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ‘పదేపదే ప్రాజెక్టుల కోసం మా దగ్గర్నుంచి నిధులను కోరడమెందుకు.. మీ రాష్ట్రంలోని సీపీఎస్‌యూల భూములను అమ్ముకుంటే సరిపోతుంది కదా’ అని రాష్ర్టానికి కేంద్రం సలహా ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. హైదరాబాద్‌లో సీఎంను కలిసి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ చర్చలు జరపడం ఈ అంశానికి బలాన్ని చేకూర్చుతున్నది.
రాష్ట్రంలో 27 సీపీఎస్‌యూలు ఉండగా, 17 నడుస్తున్నాయి. మిగిలిన 10 మూతబడగా, ఆరింటిని ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించింది. ఇక రాష్ట్రంలో ప్రైవేటీకరణకు ప్రతిపాదిస్తున్న సీపీఎస్‌యూల్లో సీసీఐ మినహా మిగిలినవన్నీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉండటంతో భూముల విలువ వేల కోట్ల రూపాయల్లోనే ఉండనున్నది. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి, ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు ప్రోత్సా హం అందించడం, వాటికి అవసరమైన పర్యావరణ వ్యవస్థలను ఏర్పాటు చేయడం, స్థానికులకు ఉద్యోగావకాశాల కల్పన, ఇతరత్రా లక్ష్యాలతో ఆయా రాష్ర్టాలు సీపీఎస్‌యూలకు భూములను కేటాయించాయి. తెలంగాణలోనూ ఇదే జరిగింది. కొన్ని సంస్థలకు ఉచితంగా, మరికొన్నింటికి నామమాత్రం ధరలకు ఇచ్చారు. దీంతో కేంద్రం ఆమోదం లేకుండా ఈ భూములను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి లేకుండా వాటిని కేంద్రం ప్రైవేటుపరం చేసే వీల్లేదు. అందుకే ఈ వ్యవహారం ఎటూ తేలట్లేదని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి.