PM Modi | కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తీరు.. ప్రభుత్వ రంగ సంస్థల పాలిట శాపంలా మారింది.
నిధుల సమీకరణే లక్ష్యంగా ఎన్నో పీఎస్యూల ఉసురు తీసేస్తున్నారు మరి. ఇది.. తమవారని చెప్పుకునే కార్పొరేట్లకు అడ్డగోలుగా లాభిస్తున్నది.
ఆ రంగం.. ఈ రంగం.. అన్న తేడా లేకుండా అన్ని రంగాల్లోనూ ప్రభుత్వ సంస్థల్లో వాటాల ఉపసంహరణకు కేంద్రం తెగబడుతున్నది. దీనివల్ల కొన్ని రంగాల్లో ప్రభుత్వ ఉనికే లేకుండా పోతున్నదిప్పుడు.
మొదట్నుంచీ ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తున్న మోదీ సర్కారు.. ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)ల్లో పెట్టుబడుల ఉపసంహరణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ఈ క్రమంలోనే తొలి ఐదేండ్ల పాలనలో సుమారు రూ.3 లక్షల కోట్లను అందుకున్న కేంద్రం.. మలి దశ పాలనలో దాదాపు రూ.1.5 లక్షల కోట్లను పొందింది. అయితే రాన్రాను పీఎస్యూలపట్ల కొనుగోలుదారులకు ఆసక్తి తగ్గుతున్నా.. వచ్చినకాడికే అమ్మేద్దాం అనేలా ఉంటున్న కేంద్ర ప్రభుత్వ తీరు ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారితీస్తున్నది. ఏండ్ల తరబడి చేసిన కష్టంతో బలమైన సంస్థలుగా ఎదిగిన వాటిని అడ్డగోలు ధరలకే కార్పొరేట్లకు అమ్ముతుండటం.. జాతి సంపదకు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎయిరిండియా ప్రైవేటీకరణ, బీఎస్ఎన్ఎల్-ఎంటీఎన్ఎల్ నష్టాలు, ఐడీబీఐ బ్యాంక్ వాటా అమ్మకం, అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టుబడులు, ప్రభుత్వ బ్యాంకుల విలీనాలు, సర్కారీ సాయం లేక మూతబడుతున్న సంస్థలు.. ఇలా చెప్పుకుంటూపోతే ఇంకెన్నో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు దర్శనమిస్తాయని మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డివిడెండ్ల కోసం పీఎస్యూలపై ఒత్తిడి తెస్తున్న కేంద్రం.. ఆర్బీఐ మిగులు నిధులపైనా కన్నేయడం పెద్ద దుమారాన్నే రేపిన విషయం తెలిసిందే. ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీల దోస్తీపై, అదానీ కంపెనీల్లో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ భారీగా పెట్టిన పెట్టుబడులు, విదేశాల్లో అదానీ ఒప్పందాల వెనుక కేంద్రం సాయం ఉందన్న దానిపై పార్లమెంట్లో జరిగిన రచ్చ కూడా విదితమే.
ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) ప్రభుత్వ రంగ సంస్థల్లో రూ.51,000 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే ఇప్పటిదాకా రూ.8,000 కోట్లనే సాధించగలిగింది. కార్పొరేట్లలో పీఎస్యూలపట్ల తగ్గిన ఆసక్తే ఇందుకు కారణంగా చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్ఎండీసీ స్టీల్, హిందుస్థాన్ జింక్, ఐడీబీఐ వాటాల విక్రయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కష్టమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్ఎండీసీలో ప్రభుత్వానికున్న 50.79 శాతం వాటా విక్రయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇక ఐడీబీఐ ప్రైవేటీకరణకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనలు అడ్డొస్తున్నాయి. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25) డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం తగ్గిపోవచ్చనీ అంటున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం షిప్పింగ్ కార్పొరేషన్, కాంకర్ వాటాల విక్రయంపైనే ఆశలు పెట్టుకున్నది మరి. నిజానికి గత ఆర్థిక సంవత్సరం (2022-23) కూడా రూ.65,000 కోట్లకు రూ.35,293 కోట్లే పీఎస్యూల్లో వాటాల అమ్మకం ద్వారా వచ్చాయి. చివరిసారిగా 2018-19లోనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరింది. అప్పుడు రూ.80,000 కోట్లకు రూ.84,972 కోట్లను అందుకున్నది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం డివిడెండ్ల రూపంలో పీఎస్యూల నుంచి రూ.43,000 కోట్లు వస్తాయని బడ్జెట్లో మోదీ సర్కారు అంచనా వేసింది. కానీ రూ.19,390 కోట్లే వచ్చాయి.
– బిజినెస్ డెస్క్