Income Tax Bill | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: కొత్త ఆదాయ పన్ను (ఐటీ) బిల్లు 2025ను కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంట్లో ప్రవేశపెడుతు న్నది. 1961 ఆదాయ పన్ను చట్టంలోని కఠిన నిబంధనలు, పదాలు, వివరణల్ని సరళతరం చేస్తూ ఈ బిల్లును తెస్తున్నామని మోదీ సర్కారు చెప్తున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో ఎటువంటి కొత్త పన్నుల విధింపు ఉండబోదంటున్న కేంద్రం.. సంక్లిష్టంగా ఉన్న అసెస్మెంట్ ఇయర్ (ఏవై), ప్రీవియస్ ఇయర్ (పీవై) స్థానంలో ‘ట్యాక్స్ ఇయర్’ కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తున్నది.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను ఈ నెల 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రకటిస్తున్నప్పుడే ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో కొత్త ఐటీ బిల్లును తెస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న సంగతి విదితమే. నిజానికి గత ఏడాది జూలైలో ప్రకటించిన బడ్జెట్లోనే ప్రస్తుత ఐటీ చట్టం 1961 సమగ్ర సమీక్షను మంత్రి తెరపైకి తెచ్చారు. అందుకు తగ్గట్టే కొత్త బిల్లును మంత్రి సీతారామన్ తీసుకొస్తున్నారు.
దాదాపు 65 ఏండ్ల కిందటి ఐటీ చట్టాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో సరళీకరిస్తామని చెప్తున్న కేంద్రం.. మునుపటితో పోల్చితే కొత్తదాంట్లో సెక్షన్లు, షెడ్యూళ్లను పెంచడం గమనార్హం. 622 పేజీల్లో 526 సెక్షన్లు, 16 షెడ్యూళ్లతో కొత్త ఐటీ చట్టం రాబోతున్నది మరి. కానీ ఇప్పుడున్నదాంట్లో 880 పేజీల్లో 298 సెక్షన్లు, 14 షెడ్యూళ్లే ఉన్నాయి. చాప్టర్లు మాత్రం ఇప్పుడు, రాబోయేదాంట్లో 23గానే ఉన్నాయి. ఇక స్టాండింగ్ కమిటీ, పార్లమెంట్ ఆమోదం పొందితే వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టం అమల్లోకి రాబోతున్నది. కాగా, ఈ ఐటీ చట్టం సమీక్షపై భాగస్వాముల నుంచి 6,500 సలహాలు, సూచనల్ని కేంద్ర ప్రభుత్వం అందుకున్నది.
పన్ను చట్టాలను సరళతరం చేస్తూ, న్యాయపరమైన వివాదాలను తగ్గించడమే లక్ష్యంగా కొత్త ఆదాయ పన్ను చట్టాన్ని తెస్తున్నారని ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. మరింత పారదర్శకంగా నిబంధనల్ని రూపొందించి, ట్యాక్స్‌పేయర్ ఫ్రెండ్లీగా ప్రవేశపెడితే బాగానే ఉంటుందని డెలాయిట్ ఇండియా భాగస్వామి రోహింన్టన్ సిధ్వా అంటున్నారు.
ఇక ఫైనాన్షియల్ ఇయర్, ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అంటూ ట్యాక్స్‌పేయర్స్ తికమకపడిపోతున్నారని, కొత్త బిల్లులో వీటన్నింటినీ తొలగింగి ట్యాక్స్ ఇయర్ పదాన్ని తేవడం బాగుందని శార్దూల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ అండ్ కో పార్ట్నర్ గౌరి పురి అన్నారు. సాధారణ పన్ను చెల్లింపుదారులకు కూడా అర్థమయ్యే రీతిలో ఐటీ చట్టం ఉంటే ఆహ్వానిస్తామని ఏకేఎం గ్లోబల్ ట్యాక్స్ పార్ట్నర్ అమిత్ మహేశ్వరి అన్నారు.