Banks | న్యూఢిల్లీ, జూలై 8: కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు కొలువుదీరిన దగ్గర్నుంచి దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య క్రమేణా తగ్గిపోతున్నది. కుదిరితే వాటాల విక్రయాలు, కాకపోతే విలీనాలు. ఇదీ.. గత 11 ఏండ్లుగా సాగుతున్న తంతు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో 5 సర్కారీ బ్యాంకుల్లో వాటాల విక్రయానికి కేంద్రం సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగానే మంగళవారం ఈ లావాదేవీల కోసం సాంకేతిక, న్యాయపరమైన సలహాదారులను నియమించేందుకు అంతర్గత మంత్రుల బృందం కూడా సమావేశమైనట్టు సమాచారం. ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి, పెట్టుబడులు-ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) కార్యదర్శి తదితరులు ఇందులో పాల్గొన్నట్టు తెలుస్తున్నది. దీంతో ఇక క్షేత్రస్థాయిలో పని మొదలుకానుండగా.. వీలైనంత త్వరలోనే సదరు బ్యాంకుల్లో సర్కారీ వాటాలు తగ్గిపోనున్నాయి. అయితే ఆయా బ్యాంకుల్లో కేంద్రం 20 శాతం వరకు వాటాలను అమ్మకానికి పెట్టే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ), యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుల్లో వాటాల అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతున్నది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ), ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) పద్ధతుల ద్వారా వాటాలను ప్రభుత్వం విక్రయానికి పెట్టబోతున్నదని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. లావాదేవీల నిర్వహణకు మర్చంట్ బ్యాంకర్ల నియామకం జరిగితే.. నిధుల సమీకరణ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని పేర్కొంటున్నాయి. వాటాల విలువ, ఎంత వాటా అమ్మేయాలి? కావాల్సిన పత్రాలు, వాటి ద్వారా అనుమతులు తీసుకోవడం ఇవన్నీ చకచకా జరిగిపోనున్నాయి. అన్నీ కుదిరితే ఈ ఆర్థిక సంవత్సరం (2025-26), లేకుంటే ఎలాగైనా వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) వాటాల అమ్మకాలు కచ్ఛితంగా ఉంటాయని ప్రభుత్వ ఉన్నత వర్గాల ద్వారా తెలియవస్తున్నది. కాగా, రూ.2,000 కోట్లకు దిగువన ఉండే లావాదేవీలకు కొందరు మర్చంట్ బ్యాంకర్లు, ఆపై విలువైన లావాదేవీలకు మరికొందరిని నియమించవచ్చని అంచనా.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను ప్రైవేటీకరించాలని మోదీ సర్కారు ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నది. 2021-22 కేంద్ర బడ్జెట్లోనే ఇందుకు ప్రణాళికల్ని కూడా పెట్టింది. కానీ ఇప్పటిదాకా అది కుదరలేదు. దీంతో త్వరలో రాబోయే వాటాల ఉపసంహరణలో ముందుగా ఈ రెండింటినే ప్రైవేటీకరణ దిశగా ముందుకు జరుపాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నట్టు చెప్తున్నారు. ఇప్పటికే ఐడీబీఐ బ్యాంక్‌ను ప్రైవేట్‌పరం చేయాలని చూస్తుండగా, ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ ద్వారా కేంద్రం పావులు కదుపుతున్న సంగతి విదితమే. బ్యాంక్‌లో ఎల్ఐసీతో ప్రభుత్వ వాటాను కొనిపించినది తెలిసిందే. ఈ క్రమంలో ఆ వాటాలను అమ్మేందుకు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నదీ చూస్తూనే ఉన్నాం. ఇక అంతకుముందు ఆయా ప్రభుత్వ బ్యాంకులను ఎస్బీఐ, మరికొన్నింటిలో విలీనం చేసినదీ విదితమే.