న్యూఢిల్లీ, అక్టోబర్ 6: హైదరాబాద్‌లో ఆఫీస్ మార్కెట్‌కు ఆదరణే కరువైంది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌లో కార్యాలయ స్థలాల లీజు కార్యకలాపాలు 2.2 మిలియన్ చదరపు అడుగులకే పరిమితమయ్యాయి. గత ఏడాది జూలై-సెప్టెంబర్‌లో ఇవి 2.6 మిలియన్ చదరపు అడుగులుగా ఉండటం గమనార్హం. ఈ మేరకు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ తమ తాజా నివేదికలో వెల్లడించింది.
నిజానికి దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణాది నగరాల్లో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ పడిపోయింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులున్నా హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ అంటే హాట్ కేకుల్లా లీజుకు వెళ్లిపోవడం తెలిసిందే. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కారీ పాలనలో సీన్ రివర్సైంది.
ఇతర రాష్ర్టాల్లో నెలకొన్నట్టుగానే తెలంగాణలోనూ ప్రతికూల పరిస్థితులు మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఒకింత ఆందోళనైతే కనిపిస్తున్నది. గతంలో జీసీసీలు, ఐటీ తదితర రంగాలకు చెందిన దేశ, విదేశీ కంపెనీల నుంచి డిమాండ్ కనిపించేదని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా 9 నగరాలపై సీబీఆర్ఈ సర్వే చేపట్టింది.