న్యూఢిల్లీ, జూన్ 26: సైబర్ నేరాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది. దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలన అరికట్టడానికి సీబీఐ ఏకంగా 42 ప్రదేశాల్లో గురువారం దాడులు నిర్వహించింది. ఆపరేషన్ చక్ర-వీ పేరుతో నిర్వహించిన ఈ దాడులు మొత్తం 5 రాష్ర్టాల్లోని 42 ప్రదేశాల్లో నిర్వహించిన దాడుల్లో 9 మందిని అరెస్ట్ చేసింది. వీరిలో ఏజెంట్లు, అగ్రిగ్రేటర్లు, ఖాతాదారులు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఉన్నారు.
యూపీఐ ద్వారా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్నట్టు గుర్తించి వీరిని అదుపులోకి తీసుకున్నట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా దాదాపు 700 బ్యాంకు శాఖల పరిధిలోని 8.5 లక్షల మ్యూల్ ఖాతా ల ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్టు నిఘా వర్గాల సమాచారంతో ఈ దాడులు చేపట్టినట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
నేరాలు, కుంభకోణాలు, మోసాలు, ఇతర అక్రమ మార్గాల్లో సొత్తును దోచుకున్నవారు దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా అక్రమ లావాదేవీలు, మనీ లాండరింగ్ కార్యకలాపాలు చేయడానికి అనామికుల పేరిట బ్యాంక్ ఖాతాలు తెరుస్తుంటారు. అక్రమ సొత్తును అందులోకి మళ్లిస్తుంటారు. సైబర్ నేరగాళ్లు వారు కొల్లగొట్టిన నగదును మళ్లించేందుకు మ్యూల్ ఖాతాల్ని వినియోగిస్తుంటారు.