న్యూఢిల్లీ, డిసెంబర్ 23: ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణంలో ఆ సంస్థ మాజీ సీఈవో చందా కొచ్చర్‌ను సీబీఐ శుక్రవారం అరెస్టు చేసింది. ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ను కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకున్నది. వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల మంజూరులో అవకతవకలకు పాల్పడ్డారన్నదానిపై సీబీఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొచ్చర్ దంపతుల అరెస్టు జరిగింది. 2012లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా చందా కొచ్చర్ ఉన్నప్పుడు వీడియోకాన్‌కు రూ.3,250 కోట్ల రుణం మంజూరైంది. అయితే ఈ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వీడియోకాన్‌కు అనుకూలంగా చందా కొచ్చర్ వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి.
తదనంతర కాలంలో ఈ రుణం మొండి బకాయిగా కూడా మారింది. దీనిపై బ్యాంక్ ఫిర్యాదు చేయడంతో కేసు సీబీఐకి చేరింది. ఫలితంగా బ్యాంక్‌ను మోసం చేసి నేరపూరిత కుట్ర చేశారన్న అభియోగాలను చందా కొచ్చర్‌పై సీబీఐ నమోదు చేసింది. ఈ వ్యవహారంలో చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్, వారి కుటుంబ సభ్యులు కూడా లబ్ధి పొందారంటున్నారు. కాగా, ఈ కుంభకోణం నేపథ్యంలో 2018 అక్టోబర్‌లో బ్యాంక్ ఎండీ, సీఈవో పదవుల నుంచి చందా కొచ్చర్ తప్పుకున్నారు. 2019లో బ్యాంక్ కోడ్ ఆఫ్ కండక్ట్, అంతర్గత పాలసీల ఉల్లంఘన జరిగిందంటూ చందా కొచ్చర్‌పై ఐసీఐసీఐ వేటు వేసింది. కాగా, ఐసీఐసీఐ బ్యాంక్‌లో మూడు దశాబ్దాలకుపైగా కాలంలో ఎన్నోసార్లు అత్యంత ప్రభావశీల మహిళగా చందా కొచ్చర్ గుర్తింపును పొందారు. కేంద్రం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.