న్యూఢిల్లీ, జూన్ 9: ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) మూడేండ్ల గరిష్ఠ స్థాయిని తాకుతూ 43.8 బిలియన్ డాలర్లకు చేరవచ్చని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. 2020-21లో 23.91 బిలియన్ డాలర్ల క్యాడ్ మిగులు (జీడీపీలో 0.9 శాతం) నమోదవగా, 2021-22లో మాత్రం 43.81 లోటు ఏర్పడే వీలుందన్నది.
ఇది జీడీపీలో 1.8 శాతమని రేటింగ్ సంస్థ తెలిపింది. ఈ జనవరి-మార్చిలో 17.3 బిలియన్ డాలర్ల (జీడీపీలో 1.96 శాతం) క్యాడ్ నమోదయ్యిందని, ఇది క్యూ3 క్యాడ్ 23.02 బిలియన్ డాలర్లకంటే (జీడీపీలో 2.74 శాతం, 13 త్రైమాసికాల గరిష్ఠం)తక్కువని పేర్కొంది. ఇక ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వస్తూత్పత్తుల ఎగుమతులు 42.4 వృద్ధి చెంది ఆల్టైమ్ గరిష్ఠం 421.8 బిలియన్ డాలర్లకు చేరాయన్నది.
కమోడిటీ ధరలు పెరగడం, రూపాయి క్షీణించడంతో ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్లో ఎగుమతుల విలువ మరింత ఎగసి 112.5 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా వేసింది. ఇదే కాలంలో దిగుమతుల విలువ 120.9 బిలియన్ డాలర్లకు పెరుగుతుందన్నది. క్యూ1లో రూపాయి సగటు మారకపు విలువ 77.1గా ఉంటుందని అంచనా వేసింది.