UPS | న్యూఢిల్లీ, ఆగస్టు 26: రిటైర్మెంట్ తర్వాత భరోసాతో కూడిన పెన్షన్ ఆదాయం రావాలంటూ ఆందోళన బాట పట్టిన ఓ వర్గం ప్రభుత్వ ఉద్యోగులను శాంతింపజేసేలా ఇటీవల కేంద్ర సర్కారు యూనిఫైడ్ పెన్షన్ స్కీం (యూపీఎస్)ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎవరైతే కొత్త పెన్షన్ స్కీం (ఎన్పీఎస్)లో ఉన్నారో వారికే దీన్ని ఎంచుకొనే సౌలభ్యం కల్పించారు. మరి నిపుణులేమంటున్నారు?
యూపీఎస్‌లో గ్యారంటీడ్ ఇన్కమ్ ఆకట్టుకుంటున్నదని సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, లాడర్7 వెల్త్ పార్ట్నర్స్ సీఈవో సురేశ్ సదగోపన్ అంటున్నారు. చివరి 12 నెలలు పొందిన జీతంలోని బేసిక్ పే సగటులో 50 శాతాన్ని నెలనెలా పెన్షన్‌గా తీసుకోవచ్చని చెప్తున్నారు. కాబట్టి ఎన్పీఎస్ నుంచి యూపీఎస్‌కు మారడం లాభమేనని అభిప్రాయపడుతున్నారాయన. ఇక రిటైర్మెంట్ వయసు ఇంకా చాలాకాలం ఉన్నైట్టెతే ఎన్‌పీఎస్‌లోనే ఉండాలని ఉద్యోగులకు వాల్యూ రిసెర్చ్ సీఈవో ధీరేంద్ర కుమార్ సలహా ఇస్తున్నారు. ఈక్విటీ మార్కెట్ రిటర్న్స్‌ను అందుకోవచ్చని సూచిస్తున్నారు.
ఎన్‌పీఎస్‌లో పోగైన సొమ్ములో రిటైర్మెంట్ సమయంలో ఒకేసారి పొందే 60 శాతం మొత్తాలకు పన్నుండదు. మిగతా 40 శాతం మొత్తాలు నెలనెలా పెన్షన్ రూపంలో వస్తాయి. అయితే వీటిపై మాత్రం సదరు ఉద్యోగికి వర్తించే ఐటీ స్లాబు ప్రకారం పన్నులు పడుతాయి. ఇక యూపీఎస్‌లో పన్నుల వర్తింపు గురించి కేంద్రం నుంచి ప్రకటన రావాల్సి ఉన్నది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి యూపీఎస్ అమల్లోకి రానున్నది. కనీసం 25 ఏండ్ల సర్వీస్ ఉంటే గ్యారంటీడ్ పెన్షన్ వస్తుంది.