Foxconn | హైదరాబాద్, మే 15(నమస్తే తెలంగాణ) : రాష్ట్రానికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన ఒక్కో సంస్థ ఇక్కడి అమడదూరంగా వెళ్లిపోతున్నాయి. దీంతో చిప్‌ల తయారీ పరిశ్రమ ఇక్కడికి రావడం ఎండమావిగానే కనిపిస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు కంపెనీలు రాష్ట్రంలో యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక్కడ ఏర్పాటు చేయలేమని భావించి ఇతర రాష్ర్టాలకు తరలివెళ్లిపోయాయి. ఇప్పటివరకు దేశంలో ఆరు సెమీకండక్టర్ యూనిట్లకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపగా..అందులో మన రాష్ర్టానికి చోటు లేకపోవడం విశేషం. నాలుగు యూనిట్లు గుజరాత్లో ఏర్పాటుకానుండగా, ఒకటి అస్సాం, మరొకటి ఉత్తరప్రదేశ్‌కు తరలిపోయింది.
ఇక్కడ యూనిట్ ఏర్పాటునకు అవసరమైన పర్యావరణ పరిస్థితులు పుష్కలంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ర్టానికి గుడ్‌బై పలుకుతున్నాయి. ఇదేక్రమంలో హెచ్‌సీఎల్, ఫాక్స్‌కాన్ సంయుక్త భాగస్వామ్యంలో రూ.3,706 కోట్ల పెట్టుబడితో ఉత్తరప్రదేశ్‌లో చిప్‌ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. వచ్చే రెండేండ్లలో అందుబాటులోకిరానున్న ఈ యూనిట్లో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఆటోమొబైల్స్, పీసీల కోసం డిస్ప్లే డ్రైవ్ చిప్‌లు తయారుకానున్నాయి. తాజా చిప్ యూనిట్‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో మన రాష్ట్రంలో సెమీకండక్టర్ల పరిశ్రమ భవితవ్యంపై సర్వత్రా చర్చ మొదలైంది. దీనికి కారణం లేకపోలేదు. ఐటీ రంగానికి ప్రధాన కేంద్రంగా మారిన హైదరాబాద్‌ను సెమీకండక్టర్ల తయారీలోనూ అభివృద్ధి చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషిచేసింది. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీల ఏర్పాటు ద్వారా మన రాష్ట్రంలో సెమీకండక్టర్ల పరిశ్రమకు అవసరమైన పర్యావరణ వ్యవస్థ ఏర్పాటైంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విశేష కృషితో కార్నింగ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్, కేన్స్ సెమికాన్ కంపెనీలు రాష్ట్రంలో సెమీకండక్టర్ల యూనిట్లు స్థాపించేందుకు ముందుకొచ్చాయి. ఈలోగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో కార్నింగ్ తమిళనాడుకు, కేన్స్ సెమికాన్ గుజరాత్‌కు తరలివెళ్లిపోయింది.
సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతున్న వేళ సెమీకండక్టర్ల పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న గిరాకీ అంతాఇంతా కాదు. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక అవసరాలు, విమానయాన రంగం తదితర వాటిల్లో చిప్‌ల వినియోగం రోజురోజుకూ గణనీయంగా పెరుగుతున్నది. ఇందులో భాగంగా దిగుమతులను తగ్గించి దేశంలోనే సెమీకండర్ల తయారీని ప్రోత్సహించేందుకు ఇండియా సెమీకండక్టర్ మిషన్(ఐఎస్ఎం)ను ఏర్పాటు చేసింది.
సెమీకండక్టర్ యూనిట్ల స్థాపనకు రాష్ట్రంలో పుష్కలమైన వనరులు ఉన్నప్పటికీ కంపెనీలు ముందుకు రాకపోవడంపట్ల పరిశ్రమ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అనేక ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రంలో సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ సేవలను అందిస్తున్నప్పటికీ.. సెమీకండక్టర్ల యూనిట్ ఏర్పాటు చేయడానికి ముందుకురావడం లేదు. వీటిలో అమెరికాకు చెందిన ఇంటెల్, క్వాల్కమ్, మైక్రోచిప్ టెక్నాలజీ ఇంక్.. అలాగే, జర్మనీకి చెందిన ఇన్ఫినియస్ టెక్నాలజీ, టెస్సోల్, మైక్రాస్ టెక్నాలజీ, మోస్చిప్, మిరాఫ్రా టెక్నాలజీ, ఏఎండీలు ఉన్నాయి.