KAYENS | హైదరాబాద్, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ): ఊహించిందే అయింది. గుజరాత్లో కేన్స్ సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమకు సోమవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మన రాష్ట్రంలో ఏర్పాటు కావాల్సిన ఈ పరిశ్రమ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో గుజరాత్‌కు తరలివెళ్లినట్టు ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదివరకే ఈ సంస్థకు భూమిని కేటాయించడంతో కంటి తుడుపు చర్యగా అక్కడ సెమీకండక్టర్ల పరిశ్రమకు బదులు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ యూనిట్‌తో కేన్స్ సరిపెట్టింది. గుజరాత్‌లోని సనంద్‌లో రూ. 3,300 కోట్ల పెట్టుబడితో సెమీకండక్టర్ల యూనిట్ ఏర్పాటుకు కేన్స్ సెమీకాన్ ప్రైవేట్ లిమిటెడ్ పె ట్టుకున్న ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ యూనిట్లో రోజుకు 60 లక్షల చిప్‌లు తయారు చేయనున్నారు. పరిశ్రమలు, ఆటోమోటివ్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, టెలికం, మొబైల్ ఫోన్స్ తదితర వాటికి ఉపయోగపడే చిప్‌లు ఇక్కడ తయారు కానున్నాయి. భారత్‌లో సెమీకండక్టర్స్, డిస్ప్లే మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టం ను అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా కేం ద్ర ప్రభుత్వం ఈ రంగానికి డిసెంబర్, 2021లో రూ. 76,000 కోట్లు కేటాయించిం ది. జూన్ 2023న గుజరాత్‌లోని సనంద్‌లో మొదటి సెమీకండక్టర్ యూనిట్‌కు, ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో మూడు సెమీకండక్టర్ల తయారీ యూనిట్లకు కేంద్రం ఆమోదం తెలిపింది.
టాటా ఎలక్ట్రానిక్స్ గుజరాత్‌లోని ధొలే రా, అస్సాంలోని మోరీగాంలో సెమీకండక్టర్ల యూనిట్లను ఏర్పాటు చేయనుండగా, సీజీ పవ ర్ అనే సంస్థ గుజరాత్‌లోని సనంద్‌లో యూనిట్‌ను నెలకొల్పనుంది. ప్రస్తుతం ఈ నాలుగు సెమీకండక్టర్ యూనిట్ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుండగా, వీటి మొత్తం పెట్టుబడి రూ. 1.5 లక్షల కోట్లు. వీటి మొత్తం సామర్థ్యం రోజుకు 7 కోట్ల చిప్‌ల తయారీ. తాజాగా కేన్స్ సెమికాన్కు రోజుకు 60 లక్షల చిప్‌ల తయారీ యూనిట్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది.
వాస్తవానికి కేన్స్ సెమికాన్ సంస్థ రూ. 2,800 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో సెమీకండక్టర్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడమే కాకుండా నిరుడు అక్టోబర్‌లోనే రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో యూనిట్ నిర్మాణ పనులు చేపట్టింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత, ఈ ఏడాది మార్చిలో నిర్మాణ పనులను అర్ధాంతరంగా నిలిపివేసింది. సదరు సంస్థ మన రాష్ట్రంలో యూనిట్ ఏర్పాటు ప్రణాళికలను నిలిపివేసి గుజరాత్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొన్నదని, కొంగరకలాన్‌లో చేపట్టిన ప్రాజక్టును ఈఎంఎస్(ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్) యూనిట్‌గా మార్పు చేస్తున్నట్టు అప్పట్లో వార్తలొచ్చాయి.
ఈ క్రమంలోనే గత ఆగస్టు 23న కొంగరకలాన్‌లో ఈఎంఎస్‌ను కేన్స్ సంస్థ ప్రారంభించింది. ఈ యూనిట్ ప్రారంభోత్సవం సందర్భంగా సంస్థ సీఈవో రఘు ఫణికర్ మాట్లాడుతూ, కొంగరకలాన్ యూనిట్లో ప్రధానంగా స్మార్ట్ మీటర్లతోపాటు మెయిన్ బోర్డులు, ఎన్ఐసీ కార్డ్, ప్లాస్టిక్, ఇంజెక్షన్ మౌల్డింగ్ మెషీన్లు తయారవుతాయని తెలిపారు. ఇక్కడ ప్రస్తుతం రెండు మాత్రమే తయారీ లైన్లు ఉన్నట్టు, భవిష్యత్తులో వీటిని 15-16లైన్లకు విస్తరించనున్నట్టు పేర్కొన్నారు.
అనంతరం ఇక్కడ సెమీకండక్టర్లకు సంబంధించిన అనుబంధ వస్తువులైన సబ్‌స్ట్రేట్, కో-ప్యాకేజ్ ఆప్టిక్స్, లైట్ స్పీడ్ ఫోటోనిక్స్ తదితరవాటిలో కొన్నింటిని కొంగరకలాన్‌లో తయారు చేస్తామని వివరించారు. ఈ యూనిట్ ప్రారంభానికి ముందు ఫణికర్ సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి రాష్ట్రంలో సెమీకండక్టర్ల తయారీ యూనిట్ ఏర్పాటు పరిశీలనలో ఉందని చెప్పడం గమనార్హం. తమకు ప్రస్తుతం తెలంగాణలో 46 ఎకరాల భూమి మాత్రమే ఉన్నదని, ఇది తమ అవసరాలకు కావాల్సిన భూమిలో పదో వంతు మాత్రమేరని వివరించారు.
బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ రంగాన్ని బలోపేతం చేయడంతోపాటు సెమీకండక్టర్ల తయారీకి హైదరాబాద్‌ను కేంద్రంగా తీర్చిదిద్దాలని సంకల్పించింది. ఈ క్రమంలోనే పలు ప్రఖ్యాత సంస్థలతో సంప్రదింపులు జరిపిన అప్పటి పరిశ్రమల మంత్రి కేటీఆర్.. కేన్స్ సెమికాన్తో చర్చించి రాష్ట్రంలో సెమీకండక్టర్ల యూనిట్ ఏర్పాటునకు ఒప్పించారు. ఫలితంగా ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చర్యలను ప్రారంభించిన సదరు సంస్థ, అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఒక్కసారిగా నిర్ణయాన్ని మార్చుకొని గుజరాత్లో సెమీకండక్టర్ల పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నది.
ఒకవేళ ఈ పరిశ్రమ రాష్ట్రంలో ఏర్పాటైతే భవిష్యత్తులో గుజరాత్‌కు పోటీగా మన రాష్ట్రంలో కూడా మరిన్ని సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలు ఏర్పాటయ్యేవని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. ఐదింటిలో నాలుగు పరిశ్రమలు గుజరాత్‌లోనే ఏర్పాటు కావడంతో క్రమంగా సెమీకండక్టర్ల రంగానికి గుజరాత్ కేంద్రంగా ఎదుగుతున్నదని వారు పేర్కొంటున్నారు.